Tomato Price : మండిపోతున్న టమోటా ధర .. కిలో రూ.100

టమోటా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో వంద రూపాయల దిశగా దూసుకుపోతోంది.

Tomato Price

Tomato Price : టమోటా ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. ఓసారి కిలో రూపాయి..మరోసారి రూ.100 ఇదీ టమోటా ధరల పరిస్థితి. టమాటా ధరల పరిస్థితి ఓసారి అతివృష్టి మరోసారి అనావృష్టి అనే చందంగా ఉంటుంది. దీంట్లో భాగంగానే మరోసారి టమోటా ధర ఆకాశంలోకి రాకెట్ లా దూసుకుపోతోంది. కిలో రూ.100 అమ్ముతోంది. సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. కిలో టమోటా ధర త్వరలో రూ.100 మార్కు దాటే అవకాశం ఉన్నట్లుగా ఉంది. అంటే సెంచరీ కొట్టనుందన్నమాట.

అటు ఏపీ, ఇటు తెలంగాణల్లో కూడా టమోటా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో కిలో రూ.100 అమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి టమోటా మార్కెట్లో గ్రేడ్ బట్టి 60 నుంచి 80 రూపాయల మధ్య కిలో ఏ గ్రేడ్ – రూ.80,బి గ్రేడ్ రూ.70,సి గ్రేడ్ రూ. 65లు అమ్ముతోంది. ఒకటి రెండు రోజుల్లో కిలో వంద రూపాయలు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు. దిగుబడి ఒక్కసారిగా పడిపోవడంతో పైకి ఎగబాకిన టమోటా ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావటమేనంటున్నారు. జూన్ నెల ఆఖరుకు వచ్చినా వర్షాలు మాత్రం అంతంత మాత్రంగానే పడుతున్నాయి. దీంతో టమోటా దిగుబడి తగ్గిపోయింది.ధరలు అమాతంగా పెరిగిపోయాయి.

ఒకవైపు తీవ్ర వడగాలులు, మరోవైపు అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో టమోటా పంట నష్టం వాటిల్లింది. దీంతో ధరలు పెరగటానికి కారణమంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా సాగు బాగా తగ్గిపోయింది. దీంతో సప్లై పడిపోవడంతో టమోటా కు పెరిగిన డిమాండ్ వచ్చి పడింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు టమోటా సాగు తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు వర్షపాతం తక్కువగా ఉండటంతో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. దీంతో ధరలు భారీగా పెరిగి సామాన్యులకు అందకుండా చుక్కలు చూపిస్తున్నాయి.

మదనపల్లి మార్కెట్ లోనే ఏపీ వ్యాప్తంగా ధరలు భారీగా పెరిగాయి. ఇవి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా భారీగా పెరిగాయి ధరలు.కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.80 అమ్ముతుంటే మరికొన్ని చోట్ల కిలో రూ.100 అమ్ముతోంది. దీంతో ట‘మోత’అన్నట్లుగా మారింది.

 

 

ట్రెండింగ్ వార్తలు