Three more sensational incidents in Chittoor district : మదనపల్లెలో సంచలనాన్ని రేపిన మూఢభక్తి తో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యల ఘటన మరువకముందే..చిత్తూరు జిల్లాలో మరో మూడు సంచలన ఘటనలు వెలుగులోకొచ్చాయి. మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్యల ఘటనలో రోజు వింతలు బయటపడుతుంటే..బి. కొత్తకోటలో క్షుద్ర పూజల పేరుతో ఓ కుటుంబాన్ని ఓ మాయగాడు దగా చేశాడు. దారుణానికి ఒడిగట్టాడు. తాను చెప్పినవారకే ఆ కుటుంబంలోని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని..లేదంటే.. కుటుంబంలో మొత్తం అందరూ చనిపోతాయని భయపెట్టాడు. దీంతో సదరు కుటుంబం భయాందోళనలకు గురైంది. దీంతో ఆ కుటుంబ యజమాని కన్నకూతుర్ని నరకంలోకి నెట్టేశాడు.
తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోటకు చెందిన వెంకట్ రెడ్డి స్వామీజీ అవతారం ఎత్తాడు. తనకు తోడుగా చరణ్ అనే అనుచరుణ్ని పెట్టుకుని కొత్త దందాలకు తెరలేపాడు. స్వామీజీ పేరుతో భక్తుల్ని మోసాలు చేసేవాడు. ఈక్రమంలో ఆ దొంగబాబా దగ్గరకు కృష్ణారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు. అతని కుటుంబంపై కన్నేసిన దొంగబాబా కృష్ణారెడ్డి కూతుర్ని తను చెప్పిన వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలని లేకుంటే మీ కుటుంబం మొత్తం చనిపోతారని భయపెట్టాడు. దీంతో కృష్ణారెడ్డి కూతుర్ని తన అనుచరుడు చరణ్ కు ఇచ్చి వివాహం చేయాలని..లేకుండా నువ్వు చనిపోతావని భయపెట్టాడు. దీంతో మెడిసిన్ చదువుతున్న తన కూతుర్ని స్వామీజీ అనుచరుడికిచ్చి వివాహం జరిపించాడు.
స్వామీజీ మాటలకు భయపడిపోయిన కృష్ణారెడ్డి మెడిసిన్ చదువుతున్న కూతురిని ఏమాత్రం ఆలోచించకుండా.. పదో తరగతి కూడా పాసవ్వని చరణ్‌కిచ్చి వివాహం జరిపించాడు. ఆమెను చేజేతులా నరక కూపంలోకి నెట్టాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి మోసం చేశాడు. అయితే రెండు నెలల తర్వాత చరణ్ అసలు రూపం బయటపడటంతో పాటు.. అదనపు కట్నం కోసం అమ్మాయిని వేధింపులకు గురిచేయడంతో మోసపోయామని గుర్తించడం బాధితుల వంతైంది. పెళ్లైన కొద్దిరోజులకే ఆమెకు చిత్రహింసలు మొదలవ్వడం.. తమ బిడ్డ నిత్యం వేధింపులతో అల్లాడిపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించారు. నమ్మించి మోసం చేసిన దొంగబాబా, సహా అతని అనుచరుడు చరణ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో తమదైన స్టైల్‌లో వెంకట్‌రెడ్డి ముఠా కోసం దర్యాప్తు గాలింపు ముమ్మరం చేశారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మార్చేపల్లి గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ‘తాను దేవుడి వద్దకు వెళుతున్నానంటూ’ లేఖ రాసి కనిపించకుండాపోయాడు. జనవరి 21 నుంచి యువకుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మదనపల్లె ఘటన నేపథ్యంలో తమ బిడ్డకు ఏమీ జరగకూడదని కోరుకుంటున్నారు. అదృశ్యమైన యువకుడికి భక్తి భావాలు మెండుగానే ఉన్నాయని అతను రాసిన లేఖ ద్వారా తెలుస్తోంది. గణేశ్ రాసి సూసైడ్ లేఖ లో ‘‘నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నా..నేను చనిపోయానని మీరు బాధపడొద్దు..నేను తిరిగి తమ్ముడి కొడుకుగా పుడతానని రాసి పెట్టి ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో మదనపల్లె ఘటనలాగా తమ కొడుకు ఏమైపోతాడోనని తల్లిడిల్లిపోతున్న గణేశ్ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అలాగే రామతీర్థం ఆశ్రమ నిర్వాహకులు స్వామి అత్యుతానంద హత్య కూడా చిత్తూరు జిల్లాలోనే జరిగింది. స్వామి అత్యుతానంద హత్య సంచలనం సృష్టిస్తోంది.గుళ్లపల్లి వద్ద గత 50ఏళ్లుగా రామతీర్థం సేవాశ్రమం ఉంది. అప్పట్లో ఈ ఆశ్రామానికి శాంతానంద స్వామి నిర్వాహకుడిగా ఉన్నారు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం శాంతానంద స్వామి పడుకోవటానికి వెళ్లిన కాసేపటికి ఆయన రూమ్ నుంచి శబ్దాలు రావటంతో ఓ వద్ధురాలు వెళ్లి చూడగా కాళ్లు చేతులు కొట్టుకుంటూ కనిపించారు. అప్పటికే అక్కడే ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించటంతో అక్కడే కొట్టుకుంటు పడి ఉన్న స్వామీజీని గొంతు నులిమి చంపేశాడు. దీంతో సదరు వృద్ధురాలు భయపడి అక్కడ నుంచి పారిపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇలా చిత్తూరు జిల్లాలో పలు ఘటనలు పెను సంచలనం కలిగిస్తున్నాయి. ఈ మూడు ఘటనలతో అసలు చిత్తూరు జిల్లాకు ఏమైంది? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మదనపల్లి ఘటనుంచి ఈ మూడు ఘటన వరకూ కేవలం ఐదురోజుల వ్యవధిలోనే జరగటం గమనించాల్సిన విషయం. మదలనపల్లిలో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలన కలిగిస్తోంది. మృతుల తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. వారిని రిమాండ్ లో ఉంచగా..నిందురాలు పద్మజ పిచ్చి పిచ్చిగా వ్యవహరించటం మాత్రం మానలేదు.