జమ్మలమడుగులో జగన్ వైపు ఆది సోదరులు? 

  • Publish Date - December 23, 2019 / 01:24 PM IST

సీఎం జగన్‌ సొంత జిల్లాలోని జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబం విధేయులుగా ఉంటూ వచ్చారు. అందులో భాగంగా 2014 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి మంత్రి అయ్యారు ఆదినారాయణరెడ్డి.

ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. అయితే, ఆయన కుటుంబం మాత్రం ఇప్పుడు తిరిగి జగన్ వైపు చూస్తోందట. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. 

ఆదినారాయణరెడ్డికి దూరంగా :
కొద్ది రోజుల క్రితం ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. ఆయన సోదరులు మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు. ఈనెల 23న ముఖ్యమంత్రి జగన్ స్టీల్ కార్పొరేషన్ పరిశ్రమ శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై జగన్‌కు శుభాభినందనలు తెలియజేస్తున్నానని ఆదినారాయణరెడ్డి అన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను ప్రశంసించారు.

ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు సీఎం ఆహ్వానిస్తే వెళ్తానని కూడా చెప్పారు. దానిని బట్టి ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి సోదరులైన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మిగతా కుటుంబ సభ్యులు ఆదికి దూరంగా ఉంటున్నారని టాక్‌.

వైసీపీతో టచ్‌లోనే :
ఆది సోదరులు, కుటుంబ సభ్యులు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు పార్టీ పెద్దలను కలుస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం జగన్ 23 శంకుస్థాపనకు వచ్చిన సమయంలో పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. జగన్‌తో కలిసి రాజకీయంగా నడవాలని భావిస్తున్నారట.

అయితే, అక్కడ టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వీరు అంతకు ముందే వైసీపీలో చేరిపోవాలనే ఆలోచనలో ఉన్నారంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.