Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి అస్వస్థత.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు

పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు.

Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే స్పందించిన రాజంపేట సబ్ జైలు సిబ్బంది ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం పోసానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అటు పోసాని కృష్ణమురళితో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ములాఖత్ అయ్యారు. పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు.

28వ తేదీన పోసానిని రాజంపేట సబ్ జైలుకి తరలించారు. జైల్లో అస్వస్థతకు గురి కావడంతో జైలు సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. నిన్న తనతో మాట్లాడేందుకు వచ్చిన స్నేహితులతో.. తనకు ఆరోగ్యం బాగోలేదని, విరేచనాలు అవుతున్నాయని వాళ్లకు సమాచారం ఇచ్చారు పోసాని. దీంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను పిలిపించి సబ్ జైల్లో పోసానికి వైద్య చికిత్స అందించారు. కానీ, ఇవాళ పోసాని మరింత అనారోగ్యానికి గురి కావడంతో జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఏపీ పోలీసులు ఇటీవల పోసానిని హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. జనసేన నేత మణి ఇచ్చిన ఫిర్యాదుతో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం రాత్రి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. కులాలు, వర్గాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, చిచ్చు పెట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు.

Also Read : వైసీపీలో వరుస అరెస్ట్‌లు.. అసలు రీజన్‌ అదేనా? వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది?

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు పోసానిని రాజంపేట సబ్‌జైలుకి తరలించారు. జైలు అధికారులు పోసానికి ఖైదీ నెంబర్ 2261 కేటాయించారు. అక్కడ ఆయన రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదయ్యాయి.