అసలే పేద రాష్ట్రం : మండలిని రద్దు చేసేద్దాం – సీఎం జగన్

  • Publish Date - January 23, 2020 / 12:22 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలి అవసరమా ? కొనసాగించాలా అనే దానిపై సీరియస్‌గా ఆలోచించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో రెండో సభ ఉండాలా ? వద్దా ? అనే విషయం ముందుకు వస్తే..మండలి వద్దు అని మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉందని, పేద రాష్ట్రానికి మండలి అవసరమా ? అని ఆలోచించాలన్నారు.

మేధావులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండదు కనుక..మండలి అవసరమని భావించారని తెలిపారు. కానీ శాసనసభలో లాయర్స్, విద్యావంతులు, ఇంజనీర్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, టీచర్లు, యాక్టర్లు, రైతులు ఉన్నారని చెప్పారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఉన్నారన్నారు. అన్నింటికీ మించి రైతులు, జర్నలిస్టులు కూడా ఉన్నారన్నారు. మండలి అవసరం ఏంటీ ? అనే విషయంపై సీరియస్‌గా ఆలోచించాలని మరోసారి చెప్పారు.

ఇక మండలి సమావేశానికి రూ. 60 కోట్లు ఖర్చువుతుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. అసలే పేదరికం ఉన్న ఏపీకి..ఇంత ఖర్చు అవసరమా ? అని ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శాసనసభలో ప్రతిపక్ష నేత. తనకు సంబంధం లేని సభ (శాసనమండలి) ఎలాంటి సంకేతాలు, ఆదేశాలు ఇవ్వడానికి కూర్చొన్నారో అందరూ చూసినట్లు తెలిపారు. చట్టం ప్రకారం నడుస్తుందా ? లేక చట్టం..పార్టీ ఇష్టాఇష్టాల ప్రకారం ఓ వ్యక్తి ప్రకారం నడుస్తుందా ? అనేది అందరికీ కనిపించిందన్నారు.

మండలి అనేది సలహాలు, సూచనలుగా పెద్దల సభగా ఉండాలన్నారు. బిల్లులను చట్టం కాకుండా..నిరోధించే సభ ఈ రోజు మారినట్లుగా అందరం చూస్తున్నామన్నారు. తప్పు అని తెలిసి కూడా..తప్పును ఉద్దేశ్యపూర్వకంగా చేస్తానని అని మండలి అంటుంటే..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అన్నారు. తప్పును చేయనీయకుండా..ఆపాలా ? వద్దా ? అనే దానిపై ఆలోచించాలన్నారు సీఎం జగన్. 

Read More : బై ద పీపుల్..ఆఫ్ ద పీపుల్ : మండలి ఛైర్మన్ తీరు బాధేస్తోంది – సీఎం జగన్