ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన బాధితులకు అదనపు పరిహారం..!

కొరియా ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలవడానికి వచ్చినప్పుడు ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరారని ఎమ్మెల్యే తెలిపారు.

LG Polymers Gas Leak Victims (Photo Credit : Google)

LG Polymers Gas Leak Victims : ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. కలెక్టరేట్ లో ఎల్జీ పాలిమర్స్ పరిహారంపై ఎంపీ భరత్, కలెక్టర్ ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు.. ఎల్జీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే గణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టిందన్నారు.

Also Read : పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ వైఖరి మారిందా? ఏం జరుగుతోందో తెలుసా?

కొరియా ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలవడానికి వచ్చినప్పుడు ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరారని ఎమ్మెల్యే తెలిపారు. బాధిత గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామ ప్రజలకు విద్య, వైద్యంతో పాటు సురక్షిత మంచినీటిని అందిస్తామని ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు.

విశాఖపట్నం శివారులోని వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ ఉంది. 2020 మే 7వ తేదీన తెల్లవారుజామున ప్లాంట్ నుంచి స్టైరీన్ గ్యాస్‌ లీక్ అయ్యింది. ఈ ఘటనలో 12 మంది స్పాట్ లోనే మరణించారు. దాదాపుగా 400 మందికి పైగా బాధితులు ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటికీ వారంతా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇళ్లలో నిద్రిస్తున్న వారు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిశ్రమ పరిసరాల నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్పటికే గ్యాస్ పీల్చిన వారు, పారిపోలేని వారు రోడ్డు మీదే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం కింద రూ.కోటి చొప్పున ప్రభుత్వం చెల్లించింది. కోర్టు ఆదేశాలతోఎల్జీ పాలిమర్స్‌ సంస్థ విశాఖపట్నం కలెక్టర్‌ దగ్గర పరిహారం కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసింది. కాగా, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు మరో రకంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లీక్ ప్రభావం తమను ఆర్థికంగా చంపేసిందని కన్నీటిపర్యంతం అవుతున్నారు.