Chandrababu Bail
TDP Celebrations : చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్నాయి. టీడీపీ సంబరాలపై అధికార వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆరోగ్య కారణాలు చెప్పి చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యారే కానీ నిర్దోషిగా బయటకు రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు. నిజం గెలిచిందని సంబరాలు చేసుకోవడం ఏంటని మండిపడ్డారు.
విజయోత్సవ సంబరాలు ఎందుకు?- సజ్జల
బెయిల్ కు అడ్డదారులు తొక్కారు. సాధారణ చర్మ వ్యాధులను ప్రాణాంతకమైనవిగా ప్రచారం చేసుకుని, మరో క్షణంలో ప్రాణం పోతుంది అనే వాతావరణం క్రియేట్ చేసి సింపతీ క్రియేట్ చేసి ఏదో ఒక రకంగా బెయిల్ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేశారు. దానికి కోర్టు కూడా అంగీకరించింది. కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పింది. ఇందులో విజయోత్సవ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు మీద కేసు తీసేసినట్లు సంబరాలు జరుపుకోవడంలో అర్థం ఉందా? కొంచెమన్నా సిగ్గుండాలి కదా? సంబరాలు చేసే వాళ్లుకు, మాట్లాడే వాళ్లకు సిగ్గుండాలి.
Also Read : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల
సంబరాలు చేసుకోవడం దురదృష్టకరం- అంబటి రాంబాబు
ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కోర్టు 4 వారాల పాటు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, చంద్రబాబు బయటకు వచ్చేశారు అని హంగామా చేశారు. టీడీపీ నాయకులు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావడం లేదు. సంబరాలు చేసుకోవడం దురదృష్టకరమైన పరిణామం.
రోగాలున్నాయిని బెయిల్ ఇచ్చారు- వెల్లంపల్లి శ్రీనివాసరావు
నాకు కళ్లు బాగుండటం లేదు, నాకు మైండ్ బాగుండటం లేదు, నాకు బాడీలో అలర్జీ వచ్చింది, అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ విషయం గుర్తుంచుకోండి. నెల రోజుల తర్వాత మళ్లీ అదే రాజమండ్రి జైలుకెళ్లాలి. మర్చిపోవద్దు. దీనికి ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి.
Also Read : మీరు చూపిన అభిమానం జీవితంలో మర్చిపోలేను- జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు
మళ్లీ అదే జైలుకెళ్లాలి, మర్చిపోవద్దు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని మధ్యంతర బెయిల్ ఇస్తే టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. ఇల్లు అలకగానే పండుగ చేసుకోవడం సరికాదు. అది కండీషనల్ బెయిల్. ఇంకా బాబుపై అనేక కేసులు ఉన్నాయి. అప్పుడే సంబరాలు చేసుకోవడం ఎందుకు? మళ్లీ జైలుకు వెళ్లాలిగా.