AP Assembly Budget Session 2025 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈ నెల 25వ తేదీన చర్చ జరగనుంది. 26వ తేదీన శివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సభ ఉండదు. 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 3 నుంచి బడ్జెట్ చర్చ జరగనుంది. మరోవైపు సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్నిరోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలి అనే అజెండాను ఖరారు చేయనున్నారు. అయితే మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయితే ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సభకు వైసీపీ ఎమ్మెల్యేలంతా రానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రేపటి సమావేశంలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ ను హైకోర్టు కోరినా.. ఇప్పటివరకు తన అభిప్రాయాన్ని చెప్పలేదు. ఈ క్రమంలో రేపటి సమావేశంలో ఈ అంశంపై వైసీపీ నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయి.
Also Read : గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కీ విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. ప్రశ్నలు, సందేహాలు ఉంటే ఇక్కడ తెలపొచ్చు..
మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మండలి ఛైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు మాత్రమే అసెంబ్లీ గేట్ 1 నుంచి అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు.