Adinarayana Reddy
Adinarayana Reddy – Elections : ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్స్ కు అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నాయి. అధికార పక్షం ఓవైపు.. ప్రతిపక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన మరోవైపు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. మరో ఛాన్స్ అని సీఎం జగన్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అని పవన్ కల్యాణ్ సైతం రిక్వెస్ట్ చేస్తున్నారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు మేము సైతం అంటూ బీజేపీ కూడా తన వంతు పోరాటం చేస్తోంది.
కాగా, రాష్ట్రంలో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. పొత్తులపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ పరిస్థితుల్లో మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పొత్తుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని అన్నారు. అంతేకాదు అధికారంలోకి కూడా వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం.(Adinarayana Reddy)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే అధికారంలోకి వస్తాయంటున్నారు మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇది అనివార్యమన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం సంకేతాలు ఇచ్చిందన్నారు. పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు.
” రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులో కచ్చితంగా మూడు పార్టీలు కలుస్తాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయి. అధికారంలోకి వచ్చేది మా మూడు పార్టీలే. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం సరే, చేసిన అప్పు ఎంత? జగన్ తనపై ఉన్న కేసుల మాట చెప్పరేం?” అని
ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.
Also Read..Ashok Gajapathi Raju: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?
”రాజకీయం ఎందుకు మారింది? రేపు పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడానికి మార్గాలేంటి? అని నాలుగు రోజుల క్రితం 11 రాష్ట్రాల అధ్యక్షులను పిలిపించుకుని జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఢిల్లీ పెద్దల ఆలోచనను మేము ముందుగానే చెబుతున్నాం. భవిష్యత్తులో కచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము బీజేపీ వాళ్లం ముందుకెళ్తాం.
కచ్చితంగా కలయిక జరుగుతుంది. మూడు పార్టీల కలయిక జరుగుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తుంది. మాకు రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలి. ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక విధానం, వసతులు ఇలా అన్ని విషయాల్లో మనం ముందుండాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కాపాడాల్సిన అవసరం ఉంది.
సీఎం జగన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారు. తను చేసిన అప్పుల గురించి ఎవరికీ చెప్పడు. 7 లక్షల కోట్ల అప్పులు చేశాడు. తను పంచిన 2లక్షల 10వేల కోట్ల గురించి మాత్రమే చెబుతాడు. తమిళనాడులో జగన్ కన్నా గొప్పగా పాలన చేస్తున్నారు. జగన్ ఈ డ్రామాలు మానుకోవాలి. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం జరగాలి. నేషనల్ హైవే రోడ్లు తప్ప ఎక్కడన్నా రాష్ట్రంలో రోడ్లు వేశారా? గ్రామీణ ఉపాధి పథకాన్ని వాడుకోగలుగుతున్నారా? అన్నీ దోచుకోవడమే తప్ప అభివృద్ధి గురించి తెలియని వ్యక్తి జగన్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు” అని ఆదినారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు.