Amaravati
Amaravati Gazette: ఏపీ రాజధాని అమరావతే. అంతవరకు క్లారిటీ ఉంది. కానీ భవిష్యత్‌లో మార్పులు, చేర్పులు జరగబోవన్న నమ్మకమేంటి? ఇదే అమరావతి రైతుల టెన్షన్. ఈ డౌట్‌తోనే రాజధాని రైతులు రైతులు ఓ కండీషన్ పెడుతున్నారు.
రాజధానిని మరోచోటకు మారిస్తే తాము భూములిచ్చి ఏం లాభమనే వాదన తెరమీదకు తెస్తున్నారు. అమరావతే రాజధాని అని కేంద్రంతో రాజముద్ర వేయించండి. అవసరమైతే ఇంకా భూములు తీసుకోండి. నో అబ్జక్షన్. కానీ వన్ కండీషన్ అంటూ..గెజిట్ కోసం పట్టుబడుతున్నారు. రాజధాని ఏరియాలో మంత్రి నారాయణతో పాటు ఎవరు పర్యటించిన గెజిట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. (Amaravati Gazette)
దీంతో ఏపీ ప్రభుత్వం అధికారులు రాజధానికి గెజిట్ తీసుకొచ్చేందుకు..కేంద్రం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. అటు కూటమి సర్కార్ కూడా పొలిటికల్ లాబీయింగ్ చేసిందని అంటున్నారు.
కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌లో కీలకంగా ఉన్న టీడీపీ అలయన్స్ పార్టీలు..అమరావతికి రాజముద్ర వేయించేందుకు ఎప్పటినుంచో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టిలో పెట్టిన చంద్రబాబు..రాబోయే పార్లమెంట్ సెషన్‌లో బిల్లు పాస్ చేయించేలా కేంద్ర పెద్దలను ఒప్పిస్తున్నట్లు టాక్.
Also Read: కొత్త పార్టీ, పైరసీ, మున్సిపాలిటీల విలీనంపై కవిత కీలక కామెంట్స్
కేంద్రం ఇప్పటికే అమరావతికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. రాజధాని నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వడంతో పాటు లోన్ తెచ్చుకోవడానికి కూడా ఒప్పుకుంది. ఇదే సమయంలో అమరావతి రైతుల కోరిక ప్రకారం కేంద్రం కీలక బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రెడీ అవుతోందన్న ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ధృవీకరించే గెజిట్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం దిశగా కసరత్తు జరుగుతోందట. త్వరలో జరిగే పార్లమెంట్ వింటర్ సెషన్‌లో అమరావతి రాజధాని బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు.
ఈ బిల్లు కోసం ఇప్పటికే కొంత ప్రాసెస్ పూర్తి చేసి పెట్టారని..కేంద్ర హోం శాఖలో కూడా ఫైల్ క్లియర్ అయ్యిందని..న్యాయశాఖలో పరిశీలనలో ఉన్నట్లుగా కూటమి వర్గాల టాక్. పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయి..కేంద్రం గెజిట్ ఇస్తే ఏపీ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసమే ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారట.
రాజముద్ర పడకపోతే?
రాజముద్ర పడకపోతే.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. రాజధానిపై డైలమా కొనసాగుతోందని అమరావతి రైతులకు బెంగ పట్టుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. కానీ అమరావతిపై అనుమానాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
ప్రభుత్వం మారితే అమరావతినే కంటిన్యూ చేస్తారో లేదోనని..సజ్జల చెప్పినట్లు ట్విన్ సిటీస్ అంటూ మరో చోట నిర్మాణాలు చేపడుతారామోనన్న డౌట్స్ రైతులను వెంటాడుతున్నాయి. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ..అప్పట్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటిచింది. అలా 2019 దాకా టీడీపీ రాజధాని కోసం డిజైన్లు ప్లాన్ చేస్తూ పోయింది.
ఇంతలో ఎన్నికలు వచ్చి టీడీపీ ఓటమి పాలు అయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ వస్తూనే మూడు రాజధానుల పాటను పాడింది. అయిదేళ్ల పాటు మూడు రాజధానుల విషయం ఒక్క అడుగు ముందుకు సాగకపోయినా అమరావతిని మాత్రం పాడు పెట్టేశారన్నది పబ్లిక్ వాయిస్. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే రాజధానికి కదలిక వచ్చింది. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు, ఆఫీసర్ల బిల్డింగులు, ఇతర నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.
అయితే రైతులు కలవరపెడుతున్నది మాత్రం రాజముద్రే. అమరావతి రాజధానిని గుర్తిస్తూ పార్లమెంట్‌లో విభజన చట్టానికి సవరణ తెస్తూ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో గెజిట్ రిలీజ్ అయితే రాజముద్ర పడ్డట్లు. అయితే దేశంలో ఏ రాజధానికి కూడా గెజిట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదని..అలా ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదని..రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని సెంట్రల్ గవర్నమెంట్‌లోని అధికారులు చెప్తున్నారట.
ప్రజల్లో ఉన్న అయోమయానికి చెక్ పెట్టడంతో పాటు ఇన్వెస్టర్ల నమ్మకం కోసమైనా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పెట్టిందట. దీంతో ఒక నోటు తయారు చేసి..కేంద్ర క్యాబినెట్‌కు పంపించినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి వర్గం ఆమోదముద్ర తెలిపిన ఫైల్ న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి బిల్లు చర్చకు రాబోతోందట. ఇదే జరిగితే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.