గణితంలో 1 ప్లస్ 1 కలిసి 2 అవుతుంది.. రాజకీయాల్లో మాత్రం..: అంబటి చమక్కులు

Ambati Rambabu: నాలుగు సిద్ధం సభలతో టీడీపీ-జనసేన నేతలు శ్రీమద్రమారమణ గోవిందా అంటున్నారని ఎద్దేవా చేశారు.

గణితంలో 1 ప్లస్ 1 కలిసి 2 అవుతుందని, రాజకీయాల్లో మాత్రం జీరో అవుతుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ-జనసేన ఏపీ ఎన్నికల్లో పొత్తుల్లో పోటీ చేస్తుండడంతో ఆ పార్టీలకు ఇలా అంబటి చురకలు అంటించారు.

ప్రకాశం జిల్లాలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు సిద్ధం సభలతో టీడీపీ-జనసేన నేతలు శ్రీమద్రమారమణ గోవిందా అంటున్నారని ఎద్దేవా చేశారు. జెండా సభతో వారి బలహీనతలన్నీ ప్రజలకు అర్థమయిపోయాయని చెప్పారు.

సిద్ధం సభలకు పోటీగా టీడీపీ-జనసేన సభలను నిర్వహించలేకపోతోందని అన్నారు. రాబోయేది మల్లి వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. సీఎం జగన్‌ను ఎదుర్కునే శక్తి టీడీపీ-జనసేనకు లేదని అన్నారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామంటే కొందరు ఎగతాళి చేశారని, ఇప్పుడు అదే నెరవేరబోతుందని చెప్పారు.

నిన్నటివరకు జనసేనకు మద్దతుగా నిలిచిన కాపు సామాజిక వర్గం నేడు వైసీపీలో చేరుతోందని చెప్పారు. హరిరామ జోగయ్య కుమారుడు నిన్న వైసీపీలో చేరడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జనసేన మీద ఆశలు పెట్టుకున్న కాపులు ఇప్పుడు జగన్ మరోసారి సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అధికారం కట్టబెట్టాలని అనుకుంటుండడంతో కాపులు వైసీపీ వైపు తిరిగారని అన్నారు.

Read Also: వైసీపీ మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

ట్రెండింగ్ వార్తలు