Minister Ambati Rambabu
Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే రిమాండ్ చేశారని అన్నారు. జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా చంద్రబాబుని అరెస్ట్ చేయించారని ప్రచారం చేసి టీడీపీ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. చంద్రబాబును జైలుకి పంపాలని ఎవరికిలేదు.. సంస్థలను మేనేజ్ చేయడం ద్వారా చంద్రబాబు తప్పించుకుంటారని ప్రచారం ఉంది. అయితే, అలాంటి రోజులకు కాలం చెల్లిందని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత హెలికాప్టర్‌లో తీసుకువెళ్తామని అధికారులు చెప్పినప్పటికీ ఆయన వద్దన్నారు. రోడ్డుమార్గం ద్వారా వెళ్తే ప్రజల సానుభూతి పొందాలని చూశాడని అంబటి ఆరోపించారు.
చంద్రబాబు అరెస్ట్‌ని అడ్డుకోవాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చినా ఎవరూ పట్టించుకోలేదని అంబటి ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ఫీజులు తీసుకునే న్యాయవాదులు చంద్రబాబు కన్నా ముందే వచ్చారు. పెద్దపెద్ద న్యాయవాదులు ఏం చేశారు. బలమైన ఆధారాలు, సాక్ష్యాదారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబుని జైల్‌కి పంపాలని న్యాయస్థానం భావించిందని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకి స్కామ్‌లు చేయటం కొత్త కాదు. డబ్బు, మాయచేయడం ద్వారానే అధికారంలోకి వచ్చే అలవాటు ఆయనకు ఉందని అన్నారు.
YCP MP Vijayasai Reddy: చంద్రబాబు రాజకీయ జీవితం 2023 వరకేనా? ఎలా అంటే.. విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
చంద్రబాబు స్కాంలు చాలా ఉన్నాయి. అమరావతి పెద్ద స్కాం. అందులోకూడా వాస్తవాలు బయటకు రావాలి. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన పనులుపై విచారణ చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల ముందు ఒకరిని అరెస్ట్ చేయాలని మేం ఎందుకు అనుకుంటామని అన్నారు. టీడీపీ బంద్‌కు ఎందుకు పిలుపునిచ్చింది.. చట్టం ప్రకారం శిక్ష పడితే బంద్‌కు ఎలా మద్దతు ఇస్తారని అంబటి ప్రశ్నించారు. న్యాయస్థానం తీరుపై బంద్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హుడు, ఇంగితజ్ఞానంలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకున్న పవన్.. ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు హయంలో దాడి చేసినప్పుడు ఏం చేశారు? దుర్మార్గపు రాజకీయాలుచేసే చంద్రబాబుకు పవన్ మద్దతు ఇవ్వటం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు.