Ambedkar జయంతి నాటికి విజయవాడలో Ambedkar Park – సీఎం జగన్

  • Publish Date - July 17, 2020 / 02:25 PM IST

2021 ఏప్రిల్‌ 14, అంబేద్కర్‌ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అంబేద్కర్ పార్కును వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రెండు పనులుగా విభజన : –
అంబేద్కర్ పార్కు పనులను రెండు విభాగాలుగా విభజించాలని, విగ్రహ నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులను రెండుగా విభజించాలని సూచించారు. 2020, జులై 17వ తేదీ శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం జరిగింది. మంత్రులు పి.విశ్వరూప్, తానేటి వనిత, ధర్మాన కృష్ణదాసు, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని సహా వివిధ శాఖల సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

20 ఎకరాల్లో : –
ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ..పార్కు ఏర్పాటు కావడం వల్ల 20 ఎకరాల్లో విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు. అద్భుతంగా, అందంగా, ఆహ్లాదంగా పార్కును తీర్చిదిద్దాలని, వచ్చే ఏప్రిల్‌ 14 నాటికి పార్కు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన సూచించారు.

అంబేద్కర్ జయంతి వరకు : –
మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాలని స్పష్టంగా సూచించారు. విజయవాడ నగరానికి ఈ పార్కు తలమానికం కావాలని ఆకాక్షించారు. మంత్రులు, అధికారులు సవాల్‌గా తీసుకుని అంబేద్కర్ జయంతి నాటికి పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

విజయవాడ బ్యూటీ : –
వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని, వీలైనంత కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మొత్తానికి విజయవాడ బ్యూటీని పెంచేందుకు Ambedkar Park చాలా ఉపయోగపడుతుందన్నారు సీఎం జగన్.