ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. కోవిడ్–19 నివారణపై 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమిత్‌షా ఫోన్ చేసిన విషయాన్ని అధికారులకు సీఎం జగన్ తెలియచేశారు. ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలు, లాక్‌డౌన్ పరిణామాలు, దీని తర్వాత అనుసరించిన వ్యూహాలు, రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మిలియన్ జనాభాకు 1274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో ఉందనే విషయాన్ని తెలియచేశారు.
గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను రప్పించడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను రప్పించడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అధికారి సతీష్ చంద్ర చూసుకుంటారంటూ తాను కేంద్ర మంత్రికి తెలియజేసినట్లు, ఆ మేరకు ఆమె కార్యాలయం నుంచి కూడా ఒక అధికారిని అప్పగించారన్నారు.
ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి.. తెలుగు మత్స్యకారులను గుజరాత్ నుంచి ఏపీకి తీసుకు వచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తానంటూ నిర్మలా సీతారామన్ చెప్పినట్లు తెలిపారు సీఎం జగన్. సముద్రమార్గం ద్వారా తీసుకురావడానికి ప్రయాణికుల నౌకకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖనుంచి, సంబంధిత విభాగాలనుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉందని షాకు తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.