Traffic control in Kurnool
Traffic control in Kurnool: కర్నూలులో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రాఫిక్ మిత్ర పేరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసు విభాగం ట్రాఫిక్ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుందని అన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ మనందరి బాధ్యత అని చెప్పారు. ఎక్కడైనా, ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే నేరుగా ప్రజలే పోలీసు వెబ్ సైట్ కు ఫొటో లేదా వీడియో షేర్ చేయవచ్చని తెలిపారు. దాన్ని పరిశీలించి, ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని చెప్పారు. ప్రతి పౌరుడు పోలీసేనని, ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.
ఇవాళ కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ లో ట్రాఫిక్ మిత్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లా ప్రజలను, పౌరులను పోలీసు సేవలలో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హైల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపడం, సీట్ బెల్ట్ లేకుండా కారు నడపడం వంటి వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసు వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేయవచ్చన్నారు.