CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు

  • Publish Date - July 15, 2020 / 10:45 AM IST

కరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన వారిని ఉంచే ఐసోలేషన్ లో పౌష్టికాహారం అందిస్తోంది ప్రభుత్వం.

వైరస్ బారి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లే పేదలకు రూ. 2 వేలు అందివ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ కారణంగా చనిపోయే వారి కుటుంబానికి రూ. 15 వేలు అందచేయాల్సిందిగా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంక్షోభ సమయంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి మెరుగైన జీతాలు ఇవ్వాలన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ 2020, జులై 14వ తేదీ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లలో అన్నీ సక్రమంగా ఉండాలని, ఇది చూసే బాధ్యత మాత్రం అధికారులదేనన్నారు. రానున్న వారం రోజుల పాటు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం చేస్తున్న పనుల్లో పారదర్శకత, నాణ్యత లేకపోతే…ఫలితాలను సాధించలేమని, నష్టపోతామన్నారు.

రానున్న రోజుల్లో వసతులను మరింత పెంచాలని, కరోనా పరీక్షలు చేసేందుకు శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారాయన. ఈ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ? తదితర సమాచారం ప్రజలకు తెలిసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా వచ్చిందనే అనుమానం వచ్చిన వ్యక్తి ఎక్కడకు వెళ్లాలి ? ఎవరికి కాల్ చేయాలి ? ఇతర వివరాలు తెలుసే విధంగా Hoardings ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, వైద్య, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు