×
Ad

AP Govt : ఏపీలోని టీచర్లకు ప్రభుత్వం తీపికబురు.. ఇకపై ఆ బాధ్యతలు ఉండవ్..

Nara Lokesh : ఏపీలో పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక విషయాన్ని చెప్పారు.

Nara Lokesh

Nara Lokesh: ఏపీలో పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక విషయాన్ని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీటీఎఫ్ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, గత 17నెలల్లో ఫ్యాప్టో లేవనెత్తిన 420కిపైగా సమస్యల్లో 200 పరిష్కరించామని, 81 పరిష్కార యోగ్యం కావని, 72 విధానపరమైనవవి, 71 కోర్టు పరిధిలో ఉన్నాయని వివరించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై బోధనపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, ఉపాధ్యాయులకు ఎలాంటి బోధనేతర పనులు ఉండవని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో వచ్చే నెలలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) మినహా ఉపాధ్యాయులకు ఇతర పనులేవీ ఉండవని లోకేశ్ హామీ ఇచ్చారు. డీఈవో, ఎంఈవోలు కూడా కేవలం అభ్యసన ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించాలని, వారికి సర్వీస్ రూల్స్ వంటి బాధ్యతలు అప్పగించబోమని లోకేశ్ స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ సంఘం నేతలు లేవనెత్తిన అన్ని అంశాలను సావధానంగా విన్న మంత్రి లోకేశ్.. వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్య చదవాలనుకునే అమ్మాయిలకు ‘కలలకు రెక్కలు’ అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం ద్వారా స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ మేరకు ఉండవల్లిలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఆత్మహత్యల నివారణకు మార్గాలను సూచించేందుకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.