anganwadi
అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కొన్ని వారాలుగా ఆందోళన తెలుపుతున్న విషయం తెలిసిందే. వారితో పలుసార్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సేవల కిందకు తీసుకొస్తూ సర్కారు జీవో నంబరు2 జారీ చేసింది. ఆరు నెలల పాటు నిరసనలను నిషేధించింది. సమ్మె చేసిన కాలానికి వేతనంలో కోత విధిస్తున్నట్లు వివరించింది. అంగన్వాడీల వేతనంలోనూ ప్రభుత్వం రూ.3 వేల చొప్పున కోత విధించింది.
తీవ్రంగా ఖండించిన అంగన్వాడీలు
తమపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు ఖండించారు. తమ వేతనాలు హక్కుల కోసం పోరాడుతున్నామని, ఎస్మాకు భయపడేది లేదన్నారు. అంగన్వాడీలకు అత్యవసర సర్వీసులు వర్తించవని అన్నారు. ఆరు నెలల పాటు నిరసనలు, ధర్నాలు చేయవద్దని చెప్పడానికి మీరు ఆరు నెలలు ప్రభుత్వంలో ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు. తమ సమ్మె ఆగదని, అవసరమైతే లీగల్ గానే ఎదుర్కొంటామన్నారు. ప్రభుత్వం తమను చర్చలకి పిలవాలని.. తమ వేతనాల సమస్యను పరిష్కరించకుంటే సమ్మెను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
అంగన్వాడీలపై ఉక్కుపాదం దారుణం: లోకేశ్
అంగన్వాడీ ఉద్యమంపై సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జిఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎక్స్ (ట్విటర్)లో డిమాండ్ చేశారు. అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జగన్ అహంకారానికి.. అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదేనని పేర్కొన్నారు.
ఎస్మా అంటే ఏంటి?
అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం, సర్వీసులకు విఘాతం కలిగించేలా సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించే అధికారం సర్కారుకు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రయోగించే ఈ ఎస్మా చట్టం ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. అంతేకాదు, ప్రభుత్వాం దాన్ని మరింత పొడిగించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగుల సస్పెన్షన్‌తో పాటు డిస్మిస్, జరిమానా, జైలు శిక్ష విధించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఎస్మాను ఉల్లంఘించే పనులు చేస్తే పోలీసులు వారంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు.
Formula E: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు.. కేటీఆర్ ఆగ్రహం