AP Excise Policy: ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ.. ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం.. ఇకపై డిజిటల్ పేమెంట్స్, నిబంధనలు ఉల్లంఘిస్తే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పాలసీని(AP Excise Policy) ఖరారు చేస్తూ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది.

Andhra Pradesh government has announced the new excise policy.

  • నూతన ఎక్సైజ్ పాలసీ ఖరారు
  • నిబంధనలు దాటితే భారీ ఫైన్లు
  • డిజిటల్ ట్రాకింగ్, ఏఐ నిఘా

AP Excise Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించి నూతన ఎక్సైజ్ పాలసీని ఖరారు చేస్తూ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో పారదర్శకతను పెంచడం, అక్రమ మద్యం రవాణా, కల్తీని అరికట్టడమే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని రూపొందించారు. ఈ పాలసీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను మరో ఏడాది కాలానికి రెన్యువల్ చేయనుండగా, ఈ నిర్ణయం 2026 అక్టోబర్ 1 నుండి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఒకవేళ ప్రస్తుత యజమానులు రెన్యువల్ చేసుకోకపోతే, ఆ షాపులను రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ రుసుముతో లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తారు.

Hyderabad Traffic Alert: ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు అలర్ట్.. భారీగా ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

ఉల్లంఘనలపై తీవ్ర స్థాయి నిఘా, భారీ జరిమానాలు:

ఈ కొత్త పాలసీలో నిబంధనల ఉల్లంఘనలపై ఎక్సైజ్ శాఖ (AP Excise Policy)కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎంఆర్‌పీ ధరల కంటే అదనంగా విక్రయించడం, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మడం లేదా బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడితే తొలి తప్పిదానికి ఏకంగా రూ.10 లక్షల భారీ జరిమానా విధిస్తారు, రెండోసారి తప్పు పునరావృతమైతే సదరు లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేస్తారు. విక్రయాల్లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి దుకాణంలో 4 సీసీటీవీ కెమెరాలను అమర్చడం తప్పనిసరి చేశారు. వీటి ఆధారంగా ఏఐ టెక్నాలజీ ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తూ నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తారు.

డిజిటల్ ట్రాకింగ్, నగదు రహిత చెల్లింపులు:

మద్యం ఉత్పత్తి దశ నుంచి రిటైల్ విక్రయం వరకు ప్రతి అంశాన్ని రికార్డు చేసేందుకు ‘ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ట్రాక్ & ట్రేస్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి షాపులోనూ ఎంఆర్‌పీ ధరల బోర్డుల ప్రదర్శనను తప్పనిసరి చేయడంతో పాటు, వినియోగదారులకు క్యాష్‌తో పాటు డిజిటల్ పేమెంట్స్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే నివేదించేందుకు 14405 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అక్రమ మద్యం సమాచారం ఇచ్చి సీజ్‌కు సహకరించిన వారికి గరిష్టంగా రూ.1 లక్ష వరకు బహుమతి అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.