AP Government: వడ్డెరలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 50 శాతం రాయితీతో క్వారీ లీజులు.. 16 జిల్లాల్లో 32 క్వారీల కేటాయింపు
వడ్డెర సమాజానికి సరైన ప్రాతినిధ్యం, క్వారీ లీజులలో ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచవచ్చని ప్రభుత్వం(AP Government) భావిస్తోంది.
AP government announced quarry pool lands and a 50% concession for Vaddera community
- వడ్డెరలకు క్వారీ లీజుల కేటాయింపు
- 100 హెక్టార్ల భూమి గుర్తింపు
- ఫీజుల్లో 50 శాతం రాయితీ
AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటీర, సాంప్రదాయ వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్న బలహీన వర్గాల ఆర్థిక పరిపుష్టి, ఉపాధి భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. శతాబ్దాలుగా కఠిన శ్రమతో రాతి పనిపైనే ఆధారపడి జీవిస్తున్న వడ్డెర సమాజానికి సరైన ప్రాతినిధ్యం, క్వారీ లీజులలో ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచవచ్చని ప్రభుత్వం(AP Government) భావిస్తోంది. ఈ క్రమంలోనే వారి సంక్షేమానికి సరికొత్త ద్వారాలు తెరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
100 హెక్టార్ల భూమి ‘క్వారీ పూల్’గా గుర్తింపు:
వడ్డెరల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను క్వారీ పూల్‌గా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 16 జిల్లాల పరిధిలోని 32 ప్రాంతాల్లో సుమారు 100 హెక్టార్ల ప్రభుత్వ భూములను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది. కేటాయించిన ఈ భూముల్లో పూర్తి పారదర్శకతతో క్వారీ లీజులను కేవలం రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాలకు మాత్రమే మంజూరు చేయనున్నారు. ఈ చర్యతో వేలాది వడ్డెర కుటుంబాలకు సొంత ఊరిలోనే నిలకడైన ఉపాధి, మెరుగైన ఆదాయ అవకాశాలు లభించనున్నాయి.
సహకార సంఘాలకు 50 శాతం భారీ రాయితీ:
వడ్డెర సహకార సంఘాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. క్వారీ లీజులకు సంబంధించిన రుసుముతో పాటు సీనరేజ్ ఫీజులో ఏకంగా 50 శాతం రాయితీ (సబ్సిడీ)ని ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రాయితీల వల్ల లీజు వ్యయం తగ్గి, సంఘాల ద్వారా లభించే లాభాలు నేరుగా వడ్డెరల ఖాతాల్లోకే చేరుతాయి. ఈ ఆర్థిక ఊరట ద్వారా వడ్డెర వర్గాల జీవనోపాధికి కొండంత అండ లభించినట్లయింది.
