Mahendragiri Varahi Review: ‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ.. 200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం..
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి ట్రైలర్ బాగుండటం, సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఉన్నాడు అని తెలియడం, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
Mahendragiri Varahi Review
Mahendragiri Varahi Review: సుమంత్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మాణంలో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా నేడు సెప్టెంబర్ 11న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే..
200 ఏళ్ళ క్రితం మహేంద్రగిరి సంస్థానంలోని రాజు ఓ సంఘటనతో తన 33వ పుట్టినరోజు నాడు మరణిస్తాడు. ఆ తర్వాత రాజవంశంలో ప్రతి మగబిడ్డ 33 ఏళ్ళు రాగానే మరణిస్తాడు. దాంతో ఇది అప్పుడు జరిగిన సంఘటన వల్లే అమ్మవారి శాపం అని ఆ రాజవంశం భయపడుతూ ఉంటుంది. అలా 1993లో రాజేంద్ర వర్మ(సిద్దు జొన్నలగడ్డ) ఇవన్నీ ట్రాష్, నేను నమ్మను అని చెప్తాడు. కానీ అతను కూడా యాక్సిడెంట్ లో చనిపోతాడు. ప్రస్తుతంలో రాజేంద్రవర్మ అల్లుడు, ఆ రాజవంశానికి వారసుడు నరేంద్ర వర్మ(వంశీ చాగంటి)కి కూడా ఈ శాపం ఉంటుంది అని పూజారులు చెప్తారు.
దేవతలు, దయ్యాల పేర్లతో జనాల్ని మోసం చేసే వాళ్ళని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెడుతూ ఉంటాడు సిద్దార్థ్(సుమంత్). తన అన్న రాజీవ్(కమల్ కామరాజు) పెళ్ళికి ఏదో దోషం ఉందని మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయంలో పూజలు చేయమని చెప్పడంతో ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే రోజు నరేంద్ర వర్మ 33వ పుట్టిన రోజు కావడంతో అక్కడ ఓ దున్నపోతు వల్ల నరేంద్ర వర్మతో పాటు అతన్ని కాపాడటానికి ప్రయత్నించిన రాజీవ్ కూడా మరణిస్తాడు. దీంతో తన అన్న ఎలా చనిపోయాడు అని, ఆ రాజవంశం శాపం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు సిద్దార్థ్. మరి ఈ రీసెర్చ్ లో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? రాజీవ్ ఎందుకు చనిపోయాడు? 200 ఏళ్లుగా అమ్మవారి శాపం నిజమేనా? అసలు 200 ఏళ్ళ క్రితం ఏం జరిగింది? సిద్దార్థ్ చివరకు ఏం తెలుసుకున్నాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Epic Review: ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ‘బేబీ’ జంట ఆనంద్ – వైష్ణవి కొత్త సినిమా ఎలా ఉందంటే..?
సినిమా విశ్లేషణ..
మహేంద్రగిరి వారాహి ట్రైలర్ బాగుండటం, సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఉన్నాడు అని తెలియడం, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే మురారి సినిమాలో లాగా అమ్మవారి శాపం, కార్తికేయ సినిమాలో లాగా హీరో రీసెర్చ్ ఉంటుందని అర్ధమయిపోయింది.
ఫస్ట్ హాఫ్ మొదట శాపం గురించి చెప్పి, 1993 లో కథ చూపించి, ప్రస్తుతంలో హీరో, అతను చేసే పనులు, నరేంద్రవర్మ పూజలు, రాజీవ్ మరణంతో సాగుతుంది. రాజీవ్, నరేంద్ర వర్మ మరణంతో సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో సిద్దార్థ్ ఈ చావు, శాపం వెనక రీసెర్చ్ చేయడం, 200 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఫ్లాష్ బ్యాక్, చావుల వెనక ఏముంది అని బయటపెట్టే ట్విస్టులతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ సీన్స్ తో కాస్త సాగదీశారు. ఓ ఆలయం, ఊళ్ళో చనిపోవడం, అంతా దేవుడి వల్ల అనుకోవడం, కానీ దాని వెనక ఏదో ఉండటం.. లాంటి కథలతో కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం.. లాంటి అనేక సినిమాలు వచ్చాయి. ఈ మహేంద్రగిరి వారాహి కూడా అదే కథ.
సుమంత్ కి కమల్ కామరాజు అన్నయ్య అంటేనే నమ్మబుద్ది కాదు. సెట్ అవ్వలేదు కూడా. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అక్కడక్కడా ట్రై చేసారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ సో సో అనిపించినా సెకండ్ హాఫ్ బాగా డీల్ చేసారు. సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అయింది. ఈ చావుల వెనక ఏముందో దొరకకపోవడం, అమ్మవారి వచ్చే సీన్స్ బాగున్నాయి. చివర్లో ఇదంతా ఎవరు చేస్తున్నారు అని ఇచ్చిన రెండు ట్విస్టులు మాత్రం అదిరిపోయాయి. అసలు ఇదంతా ఎవరు చేసారు అని క్లైమాక్స్ వచ్చేదాకా ఊహించలేం కూడా. ఆ ట్విస్టులు రెండు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. గ్రాఫిక్స్, AI లో అమ్మవారి విజువల్స్ బాగానే చూపించారు. సినిమా అంతా అయిపోయాక ఒక అమ్మవారి సాంగ్ తో ఉన్న సన్నివేశం అవసరలేకపోయినా పెట్టారు అనిపిస్తుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
సుమంత్ చావుల వెనక రీసెర్చ్ చేసే పాత్రలో బాగానే నటించాడు. సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ గెస్ట్ అప్పీరెన్స్ లు బాగుంటాయి. సీనియర్ నటి మంజు భార్గవి రాజవంశం మహిళగా చాలా బాగా నటించారు. బ్రహ్మనందం పూజారి పాత్రలో కొత్తగా కనిపించి తన నటనతో మెప్పిస్తారు. వెన్నెల కిషోర్ కూడా హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పిస్తాడు. వంశీ చాగంటి రాజవంశీకుడి పాత్రలో బాగానే నటించాడు. మీనాక్షి గోస్వామి కూడా తన నటనతో మెప్పిస్తుంది. రాజీవ్ కనకాల, అలీ, సురేష్, శ్రీనివాస్ వడ్లమాని, ప్రమోదిత, నిత్యాశెట్టి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.
Also Read : Mandaadi Review: ‘మండాడి’ మూవీ రివ్యూ.. సుహాస్ విలన్ గా నటించిన సినిమా.. సముద్రంపై పోటీ అదిరిందిగా..
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా వర్క్ చేసారు. పాత కథే అయినా కొత్త దేవతని తీసుకొని రొటీన్ కథనంతోనే ఊహించని ట్విస్టులతో తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘మహేంద్రగిరి వారాహి’ 200 ఏళ్ళ క్రితం రాజవంశానికి ఇచ్చిన శాపం, దాంతో జరిగే చావులతో సస్పెన్స్ డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
