Chigurugunta Gold Mines : జొన్నగిరి తరువాత ఏపీలో మరో బంగారు గని.. 25ఏళ్ల తరువాత మళ్లీ జీవం.. 8.5టన్నుల బంగారం
chigurugunta gold mines : ఎన్ఎండీసీ అంచనాల ప్రకారం.. చిగురుగుంట ప్రాంతంలో సుమారు 18లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండే అవకాశం ఉందని, ఒక టన్ను ముడి ఖనిజం నుంచి సగటున 5.5 గ్రాముల బంగారం లభించే అవకాశముండగా.. మొత్తం 8.5 టన్నుల బంగారం వెలికితీయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh government is set to restart Chigargunta gold mines in Kuppam
Chigurugunta Gold Mines : కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గనుల ప్రాజెక్టు ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ గోల్డ్‌మైన్స్ నుంచి ఉత్పత్తి చేసిన బంగారం బిస్కెట్లు కర్నూల్ పట్టణంలోని పలు జ్యూవెలరీ షాపుల్లోకి చేరాయి. దేశం మొత్తం జొన్నగిరిలో గోల్డ్‌మైన్స్ వైపు చూస్తున్న క్రమంలో కుప్పంలోని బంగారం గనులు చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Jonnagiri Gold : ఆంధ్రప్రదేశ్ సింబల్‌తో మార్కెట్లోకి వచ్చిన జొన్నగిరి గోల్డ్.. కర్నూలు షరాఫ్ బజార్లో సందడి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలోని చిగురుగుంట గోల్డ్ మైన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 25ఏళ్లుగా మూతపడిన ఈ గనులను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గుడుపల్లె మండలంలోని చిగురుగుంట గోల్డ్ మైన్స్ నిర్వహణ కోసం మే నెలలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా.. జూన్ 25న రెండు కంపెనీలు టెండర్ ప్రక్రియలో పాల్గొన్నాయి. గతంలో 263 హెక్టార్లలో విస్తరించిన గనుల పరిధిని తాజా సర్వేలో మరో తొమ్మిది హెక్టార్లు పెంచారు.
గతేడాది అధికారుల సర్వే ప్రకారం.. చిగురుగుంట ప్రాంతంలో భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎన్ఎండీసీ అంచనాల ప్రకారం.. ఈ ప్రాంతంలో సుమారు 18లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండే అవకాశం ఉందని, ఒక టన్ను ముడి ఖనిజం నుంచి సగటున 5.5 గ్రాముల బంగారం లభించే అవకాశముండగా.. మొత్తం 8.5 టన్నుల బంగారం వెలికితీయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
చిగురుగుంట బంగారం గనులకు దశాబ్దాల చరిత్ర ఉంది. చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలను గుర్తించిన తరువాత బిసానత్తం గనిని 1968లో, చిగురుగుంట గనిని 1978లో ప్రారంభించారు. తొలుత ఎంఈసీఎల్ సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టి బంగారం ముడి ఖనిజాన్ని కేజీఎఫ్ లోని భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ (బీజీఎంఎల్) కు సరఫరా చేసింది. తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా గనుల నిర్వహణ బాధ్యతలను బీజీఎంఎల్‌కు అప్పగించారు. 1982 నుంచి 2001 జనవరి 15 వరకు బీజీఎంఎల్ తవ్వకాలు కొనసాగించింది. అయితే కేజీఎఫ్ గనులు నష్టాల్లో పడటంతో చిగురుగుంట, బిసానత్తం గనులనూ మూసివేశారు. దీంతో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.
2011లో కాంగ్రెస్ ప్రభుత్వం 150 బోర్లు వేసి బంగారం లభ్యతపై అధ్యయనం చేయగా.. గనుల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం 2022లో వైసీపీ ప్రభుత్వం హయాంలో రూ.450 కోట్లతో ఎన్ఎండీసీకి ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం చిగురుగుంట ప్రాంతంలోని బంగారం గనిని రీ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాల్లో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు అంచనాలు ఉండగా.. ఈ బంగారు గనిని రీఓపెన్ చేయడం ద్వారా స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గనుల పునఃప్రారంభానికి వేగంగా చర్యలు చేపడుతుండటంతో, చిగురుగుంట ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
