విశాఖలో అదానీ డేటా సెంటర్ పార్కు.. ఏపీ ప్రభుత్వం ఆమోదం

  • Publish Date - November 5, 2020 / 02:11 PM IST

Adani Data Center Park : విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌ సంస్థ దాదాపు రూ.15 వేల కోట్లతో ఐటి పార్కు రూపొందించనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలే ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్క్, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్క్, రిక్రియేషన్‌ సెంటర్‌తో పాటు, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనలపైనా అధికారులతో సమీక్షించారు.



ఈ సమీక్ష సమావేశంలోనే విశాఖకు అదానీ డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ కు ఆమోదం లభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదానీ గ్రూప్ విశాఖపట్నం కాపులప్పాడు ఏపిఐఐసికి చెందిన రెండువేల ఎకరాల్లో భూముల్లో 70 వేల కోట్ల పెట్టుబుడులతో రెండు వేల ఎకరాల్లో ఐటి హబ్ ఏర్పాటు చేసేందుకు ఎంవోయు కుదుర్చుకుంది.

అందులో 175 ఎకరాల్లో మౌళిక సదుపాయాలు కూడా ఏపిఐఐసి కల్పించింది. ప్రభుత్వం మారిన తరువాత ఈ ప్రాజక్ట్ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ భూమిని ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవాలని భావించింది. అదానీకి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఎట్టికేలకు ఏపీ ప్రభుత్వంతో అదానీ గ్రూప్ చర్చలు సఫలమయ్యాయి. ప్రాజెక్ట్ ఏర్పాటుకు అదానీ గ్రూప్ కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది.



మొదటి దశలో మూడు వేల కోట్లతో 90 ఎకరాల్లో డేటా పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్క్, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్క్, రిక్రియేషన్‌ సెంటర్‌తో పాటు, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు అంగీకారం కుదిరింది.

చంద్రబాబు హయంలో ఇచ్చింత మేర భూమి ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు చెప్పేసింది. కాపులప్పాడులో అంత భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం విముఖత చూపింది. అదానీ గ్రూప్ వెక్కి తగ్గి పెట్టుబడుల స్థాయి తగ్గించింది.



చివరికి 14,634 కోట్లను అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. తద్వారా 24,990 మందికి ఉపాధి లభించనుంది. సిఎం జగన్ ఇటీవల జరిపిన సమీక్ష సమావేశంలో ఇదే విషయాన్ని అధికారులు తెలియజేశారు.



ఆయా కంపెనీలు కోరుతున్న రాయితీలను, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారాన్ని సదరు సంస్థల ద్వారా లభ్యమయ్యే ఉపాధి అవకాశాలను సీఎంకు వివరించారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహ రాజధానిగా రూపొందించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ తరుణంలో కాలుష్య రహిత గ్రీన్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.