తిరుమల కొండపై ఉన్న సమస్యలేంటి.. టీటీడీపై వస్తున్న ఆరోపణలేంటి.. ప్రక్షాళన చేయాల్సినవేంటి?

ఏడుకొండలెక్కిన సామాన్య భక్తుడు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవడం గగనంగా మారింది. ఇంతకీ కొండపై ఉన్న సమస్యలేంటి..?

Andhra Pradesh Govt Special Focus on Tirumala Tirupati Temple

Tirumla Tirupati Temple : తిరుమల శ్రీవారి దర్శనం.. తీర్థయాత్ర అనగానే దర్శనం కంటే ముందు సామాన్య భక్తులకు సమస్యలే దర్శనమిచ్చే పరిస్థితులున్నాయి. ఏడుకొండలెక్కిన సామాన్య భక్తుడు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవడం గగనంగా మారింది. ఇంతకీ కొండపై ఉన్న సమస్యలేంటి..? టీటీడీపై వస్తున్న ఆరోపణలేంటి..? సామాన్యుడు ప్రశాంతంగా దర్శనం చేసుకునే పరిస్థితి ఉందా..? ప్రక్షాళన చేయాల్సినవేంటి..?

తిరుమల.. కలియుగ వైకుంఠం. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచమంతా భక్తులున్న దివ్యక్షేత్రం. శ్రీనివాసుడు ఆపద మొక్కులవాడు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. అందుకే ఆ కలియుగ దైవం దర్శనం కోసం .. ఎక్కడెక్కడి నుంచో సామాన్య భక్తులు వ్యవయప్రయాసలకు ఓర్చి ఏడు కొండలెక్కి వసతులున్నా లేకున్నా రోడ్లపై పడిగాపులు కాస్తారు. కంపార్ట్‌మెంట్లలో గంటలకు గంటలు ఎదురు చూస్తారు. కిక్కిరిసిన క్యూలైన్లలో తోసుకుంటూ.. ఆనందనిలయం ముందు దివ్యదర్శనానికి అడుగుపెడతారు. అరసెకనులో గర్భగుడి బయట క్యూలైన్లలో ఉన్న సామాన్య భక్తులను సిబ్బంది లాగి అవతల పడేస్తుంటే.. అరసెకను ఆ వేంకటేశ్వరుడి దివ్య దర్శనం చేసుకుని అరమోడ్పు కన్నులతో ఆలయం బయటకు చేరతారు. ఇది తిరుమల క్షేత్ర దర్శనం అనగానే మనకు గుర్తుకొచ్చేవి.

తిరుపతిలో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ తిరుమలలో దర్శనం ముగించుకుని కొండ దిగే వరకు సామాన్య భక్తులకు ఎన్నో అవస్థలు.. ప్రభుత్వాలు మారుతున్నా.. పాలక మండళ్లు మారుతున్నా నిత్యం భక్తుడికి ఆ వెంకన్న దర్శనం అంటే కేవలం దైవదర్శనం మాత్రమే కాదు. సమస్యలను ముందు దర్శించి వాటిని అధిగమించి ఆ తర్వాతగానీ శ్రీనివాసుడిని దర్శించుకోవడం సాధ్యం కాదు.

భక్తుల సంఖ్య పెరుగుతున్నా.. 
భార్యాభర్తలు, పిల్లపాపలు, వృద్ధులు ఇలా కుటుంబాలతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు సామాన్య భక్తులు. కొండపైకి రాగానే వాళ్లకు ముందు వసతి పెద్ద సమస్యగా మారుతుంటుంది. కాటేజీలున్నా.. భక్తుల రద్దీకి తగినంత ఉండవు. రోజురోజుకీ తిరుమలకు వచ్చే భక్తులు పెరుగుతూనే ఉన్నారు. కానీ.. కొండపై ఆ రద్దీని తట్టుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించడం పెను సవాలే. వీఐపీ భక్తులకు ప్రత్యేకమైన కాటేజ్‌లు, వసతులున్నాయి. బ్రేక్‌ , స్పెషల్‌ పేరుతో రెండు మూడు గంటల్లోనే వెంకన్న దర్శనం పూర్తవుతుంది. సామాన్య భక్తులకు వసతి సముదాయాలు అంతంత మాత్రమే. కొండపై వీఐపీలకే ప్రాధాన్యమిస్తున్నారని వారి సేవలోనే టీటీడీ తరిస్తోందన్న ఆరోపణలు పెరిగాయి. వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా టీటీడీ మాత్రం ఉన్న కాటేజీలతోనే సర్దుబాటు చేస్తోందని.. సామాన్య భక్తులకు కొత్త కాటేజీలు, వసతి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

సామాన్య భక్తులకు అవస్థలు
వారాంతాలు, పర్వదినాలు, సెలవులు, బ్రహ్మోత్సవాలు.. ఇలాంటి సమయాల్లో తిరుమలకు రద్దీ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు భక్తులు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. ఓవైపు తమ ఇలవేల్పు, నమ్మిన దైవమైన వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలి. అంతకు ముందు కొండపై క్యూలైన్లలో సమస్యలతో సావాసం చేసి ముందుకు సాగాలి. రద్దీ సమయాల్లో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోతాయి. వెలుపలకు కిలోమీటర్ల క్యూలైన్లు కనిపిస్తాయి. చిన్నపిల్లలతో వచ్చినవాళ్లు, వృద్ధులు ఆ క్యూలైన్లు, కంపార్టమెంట్లలో ముందుకు నడవడమంటే కత్తిమీద సామే. అలాంటి వారికి ప్రత్యేక వసతులు కల్పించి వీలైనంత త్వరగా దర్శనం పూర్తి చేయించాల్సిన అవసరముందనేది భక్తుల నుంచి వస్తున్న విన్నపం.

Also Read : సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ జగనేనా? వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యమా?

అన్నప్రసాదం క్వాలిటీపై కంప్లైంట్స్‌
కంపార్ట్‌మెంట్లలో దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాలి. అక్కడ పలు ప్రాంతాలకు చెందిన భక్తులుంటారు. పెరుగన్నం, పులిహోర, సాంబార్‌ రైస్‌ ఇలా ప్రసాదాలను కంపార్టమెంట్లలో భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ అందిస్తుంటుంది. వీటి నాణ్యత విషయంలో భక్తుల నుంచి రకరకాల కంప్లైంట్స్‌ అందుతున్నాయి. నిత్య అన్నదాన సత్రంలో అన్నప్రసాదం క్వాలిటీపైనా రకరకాల విమర్శలున్నాయి. దర్శనానంతరం శ్రీవారి దివ్యప్రసాదంగా లడ్డూను భక్తులకు అందిస్తారు. వీటి తయారీ, నాణ్యత, లడ్డూ సైజ్‌పై కూడా ఫిర్యాదులు ఈమధ్యకాలంలో పెరిగాయి. ఒకప్పుడు లడ్డూ వారం రోజులు నిల్వ ఉన్నా ఎలాంటి దుర్వాసన వచ్చేది కాదు. కానీ.. అందులో వాడే సరుకుల క్వాలిటీలోపం కారణంగా రెండ్రోజులకే లడ్డూ ప్రసాదం చెడుపోతోందన్న కంప్లైంట్స్‌ వ్యక్తమవుతున్నాయి. వీటిపైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది భక్తుల ఆవేదన.

Also Read : ఆ వార్తలు అవాస్తవం.. శ్రీవారి దర్శనం, లడ్డూ ధరల్లో మార్పు లేదు : టీటీడీ

తిరుమలలో ప్రక్షాళన
ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతామని ఏపీ సీఎం చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం కొండకు వచ్చిన సందర్భంగా స్పష్టం చేశారు. భక్తులు ఎదుర్కొనే సమస్యలు ఒకవైపు ఉంటే.. గత పాలకమండలిపై విమర్శలు, అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముందుగా టీటీడీ పాలకమండలి ఈవోను మార్చి కొత్త ఈవోగా శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఏయే వ్యవస్థల్లో లోపాలున్నాయో గుర్తించి సరిచేసేందుకు స్టేట్‌లెవల్‌ విజిలెన్స్‌ కమిటీ రంగంలోకి దిగింది.

ట్రెండింగ్ వార్తలు