AP Rains: ఏపీలో దంచికొడుతున్న వానలు.. వేలాది పిడుగులతో భయానక పరిస్థితులు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఏపీలోని పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లకుపైగా వేగంతో ఈదురు గాలులతోకూడిన వర్షం కురుస్తోంది.

Heavy rains

AP Rains: ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గంటకు 60 నుంచి 80 కిలో మీటర్లకుపైగా వేగంతో ఈదురు గాలులతోపాటు భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కల్లాల్లోని రైతుల ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులు తడిసిపోయాయి. గాలివాన బీభత్సంతోపాటు వేలాది పిడుగులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని అరెస్ట్‌ చేయడంలో జాప్యంపై ఏపీ డీజీపీ ఆఫీస్ సీరియస్.. విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరులో గాలింపు..

ఏపీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో పిడుగులు పడి ఏడుగురు, చెట్టుకూలి ఒకరు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులు, వేలాది పిడుగులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పిడుగులుపడి తిరుపతి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. ఏలూరు జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు, చెట్టు మీదపడి మరొకరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోగా.. అరటి, బొప్పాయి, మామిడి నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Also Read: Transmedia Entertainment City: మొన్న రీ స్టార్ట్.. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్.. అమరావతికి భారీ ప్రాజెక్ట్.. దేశంలోనే తొలి..

పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా (ఏపీ) వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని తెలిపింది. మే10 తరువాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీనిపై కొద్దిరోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.