Andhra Pradesh Local body election controversy : ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఈ పరిస్థితుల్లో అంతా అనుకున్నట్టే అయింది.. ఓ వైపు ఎన్నికలు ఎలాగైనా జరగాల్సిందే అంటూ SEC నిమ్మగడ్డ రమేష్ పట్టుపడుతుంటే.. మరోవైపు అలా కుదరదంటూ రాష్ట్ర ప్రభుత్వం తేగెసి చెబుతోంది.. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ మరోసారి హైకోర్టుకు చేరింది.
రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు.. ఏపీలో ఇతర రాష్ట్రాలో పోల్చడం సరికాదని.. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిందని ఆమె ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు రాసిన లేఖలో తెలిపారు.. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం ఉదయం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ బిశ్వభూషణ్‌తో నిమ్మగడ్డ సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.
ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌తో నిమ్మగడ్డ చర్చించారు. సీఎస్ నీలం సాహ్ని రాసిన లేఖపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్‌ఈసీ లాంటి సంస్థలను.. చిన్నబుచ్చేలా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
మరోవైపు నిమ్మగడ్డ రమేష్ అధికారులతో తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5గంటల వరకు ఈ సమావేశం నిర్వహించాలని SEC ముందుగా నిర్ణయించింది. ఈ మేరకు అధికారులందరికీ SEC లేఖ రాసింది. అయితే సమావేశంపై CS అభ్యంతరం తెలుపుతూ లేఖ రాయడంతో వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసింది SEC.
స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.. ఓటమి భయంతోనే వైసీపీ స్థానిక ఎన్నికలకు వెనుకంజ వేస్తోందన్నారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకు వైసీపీకే ఎందుకని ప్రశ్నించారు. బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనే.. వైసీపీ భయపడుతోందని యనమల విమర్శించారు.
మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌పై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రాజీనామా చేయాలని కొడాలి డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే పదవి పోయాక నిమ్మగడ్డ ఎన్నికల్లో పోటీ చేయాలని కొడాలి సవాల్ విసిరారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ తిరిగి హైకోర్టుకు చేరనుంది.. ఇప్పుడు హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులపై ఎన్నికలు ఎప్పుడు జరిగేది త్వరలో తేలనుంది.