CM Jagan : కేంద్ర మంత్రి షెకావత్ కు పూర్తి వివరాలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. నీటి కేటాయింపుల్లో ఏపీకి న్యాయం చేయాలని సీఎం జగన్ లేఖలో కోరారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమన్నారు.
తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు శ్రీశైలంపైనే ఆధారపడ్డామని చెప్పారు. థార్ ఎడారి తర్వాత అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అనంతపురమని తెలిపారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు దుర్భక్ష ప్రాంతాల పథకంలో ఉన్నాయని అన్నారు. కరువు జిల్లాలకు 50 టీఎంసీల చొప్పున నీరు ఇవ్వగలుగుతున్నామని జగన్ చెప్పారు.
కరువు జిల్లాల్లో తాగు, సాగు అవసరాలు తీరాలంటే 100 టీఎంసీల నీరు కావాలన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు 600 టీఎంసీల నీరు కావాలని లేఖలో జగన్ తెలిపారు. ఈ అంశాలపై గతేడాది జూన్ నెలలో జరిగిన సమావేశంలో కేసీఆర్ అంగీకారం తెలిపారని జగన్ పేర్కొన్నారు.
శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీరుంటేనే పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించగలమని చెప్పారు. 44వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఏడాదికి 15 రోజులే ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు.