Anitha Vangalapudi - TTD
Anitha Vangalapudi – TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలిపై టీడీపీ నేత, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. బోర్డులో కొత్తగా నియమించిన సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ నియమించిన టీటీడీ సభ్యులు జాతి రత్నాలు అని ఎద్దేవా చేశారామె. కళంకితులు, క్రిమినల్స్, అన్యమతస్తులకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చారని మండిపడ్డారు అనిత.
” లిక్కర్ డాన్ శరత్ చంద్రారెడ్డి జైలు నుంచి రాగానే టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చారు. విశ్వనాధ్ రెడ్డి అనే వ్యక్తి భారతీ రెడ్డి అనుచరుడు. యెలహంక ప్యాలెస్ కాపలాదారుడికి టీటీడీ సభ్యత్యం ఇచ్చారు. సామినేని ఉదయభాను కొడుకు గంజాయి స్మగ్లింగ్ లో పట్టుబడ్డాడు. మద్యం తాగడం హానికరమని హెచ్చరిక వేస్తారు. అలాంటి హానికరమైన మనుషులకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇస్తారా..?(Anitha Vangalapudi)
చాగంటి కోటేశ్వరరావుకు బోర్డులో సభ్యత్వం ఇచ్చినా దాన్ని ఆయన తిరస్కరించారు. జగన్ పరిపాలనలో వేసిన టీటీడీ బోర్డులో చాగంటి కొనసాగలేకపోయారు. ఇలాంటి బోర్డు వేస్తే పులులు తరమడానికి కర్రలు ఇవ్వాలనే నిర్ణయాలే వస్తాయి. నడక మార్గంలో పులులు వస్తున్నాయి కాబట్టి నడక మార్గం మూసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డబ్బు కోసం ఎంత వరకైనా వెళ్లే వ్యక్తులు టీటీడీ బోర్డులో ఉన్నారు. వెంకన్నతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో జగన్ కు చాలా బాగా తెలుసు. అయినా జగన్ మళ్లీ వెంకన్నతోనే పెట్టుకుంటున్నారు.
Also Read..Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?
రాజకీయ నిరుద్యోగులకు తిరుమల కొండ వేదికగా మారింది. రాజకీయ నిరుద్యోగులతో టీటీడీ బోర్డును నింపేస్తున్నారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్ కు లేదా..? క్రైస్తవుడైన భూమనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని గగ్గోలు పెడుతున్నా.. సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు” అని వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు.
24 మంది సభ్యులతో కూడిన పాలకమండలి సభ్యుల జాబితాను టీటీడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కి చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పినాక శరత్ చంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి భార్య గడ్డం సీతారంజిత్ రెడ్డికి చోటు దక్కింది.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మేక శేషుబాబు, గడిరాజు వెంకట సుబ్బారాజు (ఉంగుటూరు), నెరుసు నాగసత్యం (ఏలూరు), సిద్ధవటం యానాదయ్య (కడప), కర్నూలు నుంచి సీతారామారెడ్డి, సిద్ధా రాఘరావు కుమారుడు సిద్ధా వీర వెంకట సుధీర్ కుమార్ (ప్రకాశం జిల్లా), అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ కుస్థానం దక్కింది.
మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్ కు అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండేకు పాలక మండలిలో చోటు లభించింది.
Also Read..Nagari Constituency: నగరిలో ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారో!?
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందులో కొందరు వ్యక్తుల నియామకంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని బోర్డు సభ్యుడిగా ఎలా నియమిస్తారని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ బోర్డు నియామకాలకు సంబంధించిన నియమ నిబంధనలను సీఎం జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయిన వెంటనే టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. హిందూమత సంప్రదాయాలను పాటించే వారిని మాత్రమే పాలకమండలిలో నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీటీడీ కొత్త పాలకమండలిపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. వైసీపీ పాలనలో టీటీడీ పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఓ క్రైస్తవుడిని టీటీడీ చైర్మన్ చేశారని, శరత్ చంద్రారెడ్డి వంటి కళంకితుడిని టీటీడీ సభ్యుడిగా చేశారని విమర్శించారు.