×
Ad

Annadata sukhibhava : ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ సొమ్ము వచ్చేది నేడే.. డబ్బులు పడనివారు వెంటనే ఇలా చేయండి..

Annadata sukhibhava : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి.

Annadata sukhibhava

Annadata sukhibhava : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. పీఎం కిసాన్ 21వ విడత సొమ్ము రూ.2వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం జమ చేయనుండగా.. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు రూ.5వేలు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేరోజు రూ.7వేల నగదు జమ కానుంది.

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,135 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92కోట్లు కాగా.. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వాటా రూ.972.09 కోట్లు ఉంటుంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీయేటా మూడు విడతల్లో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయించింది. పిఎం కిసాన్ పథకంతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ.20వేలు జమ చేస్తామని చెప్పింది. తొలి విడత రూ.7వేలు, రెండో విడత రూ.7వేలు, మూడో విడత రూ.6వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత డబ్బులు రైతులు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. రెండు విడతల్లో కలిపి ఈ పథకం కింద మొత్తం రూ.6,309.44 కోట్లు ప్రభుత్వం అందించినట్లవుతోంది.

బుధవారం కోయంబత్తూరులో పీఎం కిసాన్ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని అన్నదాత సుఖీభవ పథకం నగదును విడుదల చేయనున్నారు. అయితే, ఈ సారి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 10వేలకుపైగా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇలా చెక్ చేసుకోండి..
అన్నదాత సుఖీబవ పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం రైతులు https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లాక Know Your Status అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ కార్డు నంబర్ వివరాలు అడుగుతుంది. ఆధార్ కార్డు నంబరు ఎంటర్, కాప్చా నమోదు చేసిన తర్వాత.. ఆ పక్కనే ఉన్న సెర్చ్ బటన్ నొక్కాలి. ఆ తరువాత అర్హుల వివరాలు కనిపిస్తాయి. రైతు పేరుతోపాటుగా జిల్లా, మండలం, గ్రామం వివరాలు తెలుస్తాయి. అలాగే పథకం స్టేటస్ కూడా తెలుస్తోంది. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి అయిందా.. చేయించుకోవాలా అనే వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు పడ్డాయా లేదా అనే వివరాలతో పాటుగా ఏ బ్యాంకు అకౌంట్లోకి పడ్డాయనే వివరాలు కూడా తెలిసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అదేవిధంగా.. ఈ పథకానికి అర్హులైన రైతులు ఎవరైనా చనిపోయి ఉంటే.. వారి వారసులకు డెత్‌ మ్యుటేషన్‌ చేసి, లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని సూచించారు. దీనిపై సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచాలని, సొమ్ము అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే మెస్సేజ్‌లు వెళ్లాలని నిర్దేశించారు.