Annadata Sukhibhava Scheme: పంటల సాగులో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీయేటా పీఎం కిసాన్ పథకం కింద వచ్చే రూ.6వేలతోపాటు.. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం రూ.14వేలు అందజేస్తుంది.
ఈ రెండు పథకాలకు కలిపి అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతీయేటా రూ.20వేలు జమ అవుతాయి. అయితే, ఈ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులు ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కానీ, కొందరు రైతులకు మాత్రం అకౌంట్లలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమకాలేదు. అయితే, తాజాగా వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
తొలివిడతలో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలు, పీఎం కిషాన్ పథకం కింద రూ.2వేలు మొత్తం రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడని రైతులు రైతుసేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వచ్చని సూచించిన విషయం తెలిసిందే. వ్యవసాయశాఖ గ్రీవెన్స్ లో ఈనెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290, విజయనగరం జిల్లా నుంచి 1,111 దరఖాస్తులు రాగా.. మిగిలిన 24 జిల్లాల నుంచి వెయ్యిలోపు దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దరఖాస్తుల్లో మండల వ్యవసాయ అధికారి పరిధిలో 5,377 ఆమోదించగా.. 4,261 పెండింగ్‌లో పెట్టి, 29 తిరస్కరించారు. తహసీల్దార్ పరిధిలో 827 పెండింగ్‌లో ఉండగా.. 411 ఆమోదించింది 10దరఖాస్తులను తిరస్కరించారు. అయితే, గ్రీవెన్స్ లో పరిష్కారమై అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతులకు త్వరలో నిధులు విడుదలవుతాయని అధికారులు తెలిపారు.
అయితే, ఇటీవల విడుదల చేసిన అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత నిధుల్లో.. వ్యవసాయశాఖ అందించిన డేటా ప్రకారం 1,067 ఖాతాలకు మాత్రమే డబ్బులు బదలీ కాలేదని ఆర్టీజీఎస్ ద్వారా సమాచారం అందిందని తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది రైతుల ఖాతాల్లో సమస్యలు ఉన్నాయి. ఎన్‌పీసీఐలో ఖాతా పనిచేయకపోతే లేదా మ్యాప్ కాకపోతే బ్యాంకు వెళ్లి వెంటనే యాక్టివ్ చేసుకోవాలి. ఈకేవైసీ పెండింగ్ లో ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలి. అలాచేస్తే అన్నదాత సుఖీభవ పథకం పెట్టుబడి సాయం అందుతుంది. అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఈ పథకం ఫలాలు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.