ఎమ్మెల్యే శ్రీదేవి పేరిట మరో ఆడియో కలకలం

MLA Sridevi Another audio : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరుతో సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్‌గా మారింది. ఓ వర్గం నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా అందులో ఉంది. పార్టీ కార్యకర్తతో మాట్లాడినట్లుగా ఉన్నా.. శ్రీదేవిదేనా లేక మరెవరైనా మార్ఫింగ్ చేశారా అనే విషయం తేలాల్సి ఉంది.
‘మనకు మనం వాల్యూ లేదు, కలిసి ఉండాలి. మనం అందరూ ఒక్కటే. పవర్ వస్తే వాళ్ల దగ్గర ఉండాలి. మనల్ని ఎలా అణగదొక్కాలని చూస్తుంటారు. నువ్వు చేయి.. అంటూ ముందుకు తోలుతున్నారో అర్థం చేసుకోవాలి. తాము భోజనానికి కూర్చొన్న సమయంలో జోగి రమేష్ వచ్చారు. అక్కడి నుంచి జోగి రమేష్ ను అక్కిరెడ్డి పిలిచాడు. శ్రీదేవిని నువ్వు పొగుడుతావు.. ఆమె నిన్నును పొగుడుతుంది అంటూ..అక్కిరెడ్డి అన్నారు’ పలు వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది.
ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీదేవి పేరిట ఉన్న ఈ ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారం మొత్తం వారి చేతుల్లోనే ఉండాలని అనుకుంటున్నారని ఆగ్రహం చేస్తున్నట్లుగా ఉంది. ఎస్సీలను వాడుకుంటారే తప్ప కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండదని, ఎస్సీలు, బీసీలు కలిసి ఉండాలంటూ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పినట్లుగా ఉంది. ఈ ఆడియో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
గుంటూరు జిల్లాలో కీలమైన ఎస్సీ నియోజకవర్గం తాడికొండ. రాజధాని అమరావతి పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్‌లో వైద్య వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారామె. కానీ..ఈమెకు సంబంధించినట్లుగా చెబుతున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ పేకాట వ్యవహారంలో పట్టుబడ్డ తన అనుచరుడిని వదిలిపెట్టాలని ఎమ్మెల్యే శ్రీదేవి ఆదేశించారన్న విమర్శలు సంచలనం రేకెత్తించాయి.
తన వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదంటూ శ్రీదేవి అనుచరుడు ఒకరు ఆమెపై ఏకంగా మీడియాకెక్కారు. తాజాగా ఇసుక అక్రమార్కులను వదిలిపెట్టాలంటూ ఓ సీఐతో ఎమ్మెల్యే జరిపిన సీరియస్ సంభాషణలన్నీ బయటపెట్టి రచ్చరచ్చ చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి తన దగ్గర కోటి నలభై లక్షల రూపాయల నగదు తీసుకొని 60 లక్షల రూపాయలు వెనక్కు ఇచ్చారని, మిగిలిన 80 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ మేకల రవి అనే వ్యక్తి ఓ సెల్ఫీ వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తన డబ్బులు తనకు ఇప్పించాలంటూ ఆ వీడియోలో రవి ఏకంగా ముఖ్యమంత్రినే కోరాడు. ఈ వీడియో వివాదాస్పదం కావటంతో మండల పార్టీ నేతలు మేకల రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి డబ్బులిచ్చేంత స్థోమత రవికి లేదని, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కొంతమంది రవితో ఇలా చేయిస్తున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. మీడియాలో ప్రసారం అవుతున్న ఆడియో తనది కాదని గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. తన ఆడియోలను మార్ఫింగ్ చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు సందీప్, నరేశ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని శ్రీదేవి అంటున్నారు