Brahmamgari Matam : అర్థరాత్రి మంటలు.. బ్రహ్మంగారి మఠంలో మరో వివాదం

కడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో మరో వివాదం నెలకొంది. అర్థరాత్రి రికార్డులు తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Brahmamgari Matam : కడప జిల్లా బ్రహ్మం గారి మఠంలో మరో వివాదం నెలకొంది. అర్థరాత్రి రికార్డులు తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేస్తామని శివస్వామి వ్యాఖ్యానించగా ఇప్పుడు రికార్డులను కొందరు తగులబెట్టారు. అక్రమాలు బయటపడకూడదనే కీలక పత్రాలను కొంతమంది తగులబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాల్చేసిన రికార్డులు ఏంటన్న దానిపై అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.

అటు.. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు. వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వారసులతో మంత్రి వేర్వేరుగా చర్చలు కొనసాగిస్తున్నారు. మఠం నివాసంలో వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మతో మాట్లాడిన మంత్రి.. టీటీడీ అతిథి గృహంలో మొదటి భార్య కుమారులతో చర్చలు జరిపారు.

వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేజర్‌ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో పీఠాధిపత్యంపై వివాదం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు