encounter
Encounter : మావోయిస్టు పార్టీకి వరుసగా కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. మంగళవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా భద్రత బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. హిడ్మాతోపాటు అతని భార్య మడకం రాజేతోపాటు మరో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఇదే సమయంలో ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తాజాగా.. ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.
బుధవారం ఉదయం ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి మండలం జీఎంవలస సమీపంలో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌లో మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం.
మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే తాజా ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. భద్రతాబలగాలు అడవుల్లో జల్లెడపడుతున్న సమయంలో మావోలు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మిగిలిన వారు లొంగిపోవడం మంచిదని ఆయన మావోయిస్టులకు హితవుపలికారు. అయితే, మంగళవారం మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తరువాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.
ఆయుధాలు వీడి లొంగిపోండి : మల్లోజుల
ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు దళ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు సమాజం మారింది. పరిస్థితులను అర్థం చేసుకుని తాము ఆయుధాలను వీడామని వివరించారు. మిగతా దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే దళ సభ్యులు తనను సంప్రదించొచ్చని చెప్పారు.