VV Lakshmi Narayana New Party Jai Bharat National Party
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ కొత్త పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ అని తెలిపారు. అన్ని వర్గాలను కలిసి, అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ పెట్టానని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారు లక్ష్మీనారాయణ.
‘ఐపీఎస్ కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజల మధ్యకు వచ్చా. అనేక వర్గాల ప్రజలను కలిశాను. వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగా. సమస్యలు పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించా’ అని లక్ష్మీనారాయణ తెలిపారు.
”జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వీవీ లక్ష్మీనారాయణ, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చిన్నయ్య దొరను ప్రకటించారు. శ్రమతో అద్భుతాలు సృష్టించే ఆలోచన ప్రస్తుత పార్టీలకు లేదన్నారు లక్ష్మీనారాయణ. అందుకే కొత్త రాజకీయ పార్టీ పెట్టానని చెప్పారాయన. వారు తిన్నారని వీరు, వీళ్ళు తిన్నారని వాళ్లు.. నిత్యం పార్టీలు విమర్శలు చేసుకోవడమే. పెత్తందార్లు మారినా బానిసత్వం నడుస్తోంది. అభివృద్ధి, అవసరం పేరుతో ఇప్పటివరకు నేతలు చెప్పారు. అభివృద్ధితో అవసరాలు తీర్చడమే జై భారత్ నేషనల్ పార్టీ తెలియజేస్తుంది” అని లక్ష్మీనారాయణ అన్నారు.