AP Airports
AP Airports : ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్టులపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. (AP Airports)
Also Read: New Jobs : నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 2.5లక్షల కొత్త ఉద్యోగాలు.. ఏఏ రంగాల్లో అంటే..?
ఈ రెండు ఎయిర్‌పోర్టులను పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్) విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పీని కేబినెట్ ఆమోదించింది. అదేవిధంగా.. హడ్కో రుణంతో భూ సేకరణ, యుటిలిటీల బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం, ప్రతిపాదిత విమానాశ్రయం కోసం మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రతిపాదించగా.. మంత్రిమండలి ఆమోదించింది.
కుప్పం విమానాశ్రయం కోసం 1200 ఎకరాలు, దగదర్తి విమానాశ్రయం కోసం 1379.71 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరలో విమానాశ్రయాల నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది.
అయితే, దగదర్తిలో విమానాశ్రయానికి సంబంధించిన దామవరం, సున్నపుబట్టి గ్రామాల పరిధిలో 1379.71 ఎకరాల సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇందులో 669.12 ఎకరాలు సేకరించారు. మరో 710.59 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే, ఈ భూ సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కోర్టు కేసులు కూడా కొలిక్కి రావడంతో త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసి రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. కుప్పంలో 2019 జనవరిలో శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో సీఎం చంద్రబాబు మళ్లీ ఈ విషయంపై దృష్టిపెట్టారు. విమనాశ్రయం కోసం 1200 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు.. ఏపీలో మినీ ఎయిర్ పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా హెలి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో తొలుత ప్రయోగాత్మకంగా హెలికాప్టర్లు నడిపేలా ఏజెన్సీలకు ఆహ్వానం పలుకుతోంది. ఏజెన్సీల నుంచి వచ్చే ప్రతిపాదనలపై ఎక్కడెక్కడ హెలిప్యాడ్ లు ఏర్పాటు చేయాలో అనేదానిపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఏజెన్సీలు ముందుకొస్తే.. విశాఖపట్టణం, విజయవాడ, శ్రీశైలం, అరకులో మినీ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఈ మినీ విమానాశ్రయాల్లో సాధారణ ఎయిర్ పోర్టుల్లో ఉండే దాదాపు అన్ని సదుపాయాలు కల్పించనున్నారు.