AP Cabinet Meeting : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటి కొనసాగుతోంది. రాష్ట్ర సచివాలయంలో 2020, నవంబర్ 05వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశమైంది. వివిధ కారణాలతో ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడ్డ మంత్రిమండలి సమావేశం.. ఈ రోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కీలక బిల్లులతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది.
వారం రోజుల పాటు అసెంబ్లీ : –
నవంబర్ 15 తర్వాత వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఏపీ సర్కార్. ఇక కేబినెన్‌లో అసెంబ్లీ సమావేశాలు, అనుసరించాల్సిన వ్యుహంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి.. ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై మంత్రిమండలి భేటీ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముంది. దీంతో పాటు దిశ చట్టంలో మార్పులు చేసి మరోసారి ఆమోదించాల్సి ఉంది. అదే సమయంలో విశాఖకు రాజధాని మార్పుకు సంబంధించిన నిర్ణయాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
ఇసుక పాలసీలో మార్పులు : –
రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక పాలసీలో మార్పులు, చేర్చులపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది. ఇసుక పాలసీలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి.. మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక కృష్ణా, గోదావరి నదుల వరదలు, వర్షాలతో పంట నష్టం విషయంలో కేంద్రం సాయంపై కేబినెట్‌లో చర్చించనుంది.
వరద సాయం : –
ఈ నెల 9న కేంద్ర బృందం ఏపీలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనుండటంతో ఎక్కడికక్కడ ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వరద తీవ్రతను వారికి వివరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించనున్నారు. వీలున్నంత ఎక్కువగా వరద సాయాన్ని పొందేందుకు కేంద్ర బృందం ఎదుట పూర్తిస్థాయి నివేదిక ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక కొత్త టూరిజం పాలసీకి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చ : –
సాగునీటి ప్రాజెక్టులపైనా మంత్రిమండలి చర్చించనుంది. పోలవరం ప్రాజెక్ట్‌కు ముందుగా ఆమోదించిన నిధులను మాత్రమే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ, సాంకేతిక సలహా మండలి ఆమోదించిన 55 వేల కోట్లకు ఆమోదం తెలపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
కేంద్రం ఆమోదం తెలుపకపోతే : –
కేంద్రం వీటికి ఆమోదం తెలపకపోతే ఏం చేయాలనే దానిపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదానికి పంపినా తిరిగిరావడంతో చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకోవటానికి ఏం చేయాలనే దానిపైనా మంత్రిమండలి చర్చించే అవకాశం కనిపిస్తోంది.