AP Assembly Budget Session-2023: గురువారానికి వాయిదాపడ్డ ఏపీ అసెంబ్లీ.. LiveUpdates

బుధవారం సాయంత్రం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. గురువారం ఉదయం సభ తిరిగి ప్రారంభమవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.

AP Assembly Budget Session-2023: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రెండో రోజు ముగిశాయి. బుధవారం సాయంత్రం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. గురువారం ఉదయం సభ తిరిగి ప్రారంభమవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు.

రేపు ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. 19న (ఆదివారం), 22న ఉగాది సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 15 Mar 2023 04:51 PM (IST)

    రేపటికి వాయిదాపడ్డ ఏపీ అసెంబ్లీ

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదాపడ్డాయి. ఉదయం తొమ్మిది గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై సీఎం జగన్ మాట్లాడిన తర్వాత సాయంత్రం సభను స్పీకర్ వాయిదా వేశారు.

  • 15 Mar 2023 04:36 PM (IST)

    రాష్ట్రంలో 11.2 శాతం జీడీపీ వృద్ధి రేటు: సీఎం జగన్

    ఆంధ్రప్రదేశ్ జీడీపీ వృద్ధి రేటు 11.2 శాతం అని, ఇంత వృద్ధి రేటు మరే రాష్ట్రంలోనూ లేదని చెప్పారు ఏపీ సీఎం జగన్. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో జగన్ కీలకోపన్యాసం చేశారు. ‘‘రైతులు, కౌలు రైతులను ఆదుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో చరిత్రలో ఎన్నడూ లేని మార్పులు తీసుకొచ్చాం. రైతు భరోసా ద్వారా రైతులకు రూ.27 వేల కోట్లు అందించాం. గత ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. నాలుగేళ్లలో రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకొచ్చాం. ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా పూర్తి చేశాం. కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశాం. గత ప్రభుత్వంలో రూ.2 వేల పెన్షన్ ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచాం. త్వరలోనే దీన్ని రూ.3 వేలకు పెంచుతాం. రాష్ట్రంలో 64 లక్షల మంది పెన్షన్ అందుకుంటున్నారు. పెన్షన్ రూ.3 వేలకు పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

  • 15 Mar 2023 03:20 PM (IST)

    వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి సస్సెన్షన్

    వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. శాసన సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాడనే కారణంతో కోటంరెడ్డిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ తెలిపారు. కోటంరెడ్డితోపాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్‌పై కోటంరెడ్డి స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

  • 15 Mar 2023 02:14 PM (IST)

    ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని ప్రతిపాదనలు

    శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో గందరగోళం నెలకొంది. దీనిపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది. కొన్ని వార్తా కథనాలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని ప్రతిపాదనలు చేశారు. దీంతో, తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. అలాగే, టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను అగౌరపరుస్తున్నారని అన్నారు. స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • 15 Mar 2023 01:56 PM (IST)

    ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

    అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. ఈనెల 23వ తేదీ వరకు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

  • 15 Mar 2023 01:52 PM (IST)

    స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలి: బుగ్గన

    గవర్నర్, గౌరవ శాసనసభపై కొందరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని, తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పారు. అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • 15 Mar 2023 12:29 PM (IST)

    పవన్ కల్యాణ్ ని తిట్టడానికే టీ-బ్రేక్ ఇచ్చారా?: నిమ్మల

    టీ-బ్రేక్ పేరుతో గంటల తరబడి సభను వాయిదా వేసేకంటే.. ప్రశ్నోత్తరాలు కొనసాగించొచ్చు కదా? అని నిమ్మల రామానాయుడు అన్నారు. పవన్ కల్యాణ్ ని తిట్టడానికే సభకు టీ-బ్రేక్ ఇచ్చారా? అంటూ నిమ్మల మండిపడ్డారు. పేర్ని నాని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

  • 15 Mar 2023 12:27 PM (IST)

    టీ బ్రేక్.. టీడీపీ అభ్యంతరం

    నాలుగు ప్రశ్నలను వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. దీంతో ప్రశ్నోత్తరాలు పూర్తి కాకుండా సభను వాయిదా వేయడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. ప్రశ్నలు పూర్తి కాకుండా ప్రశ్నోత్తరాలను వాయిదా సరికాదని పయ్యావుల కేశవ్ అన్నారు. కీలకమైన అప్పర్ భద్ర ప్రాజెక్టుపై వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వాయిదా వేస్తే ఎలా? అంటూ పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 15 Mar 2023 11:57 AM (IST)

    పవన్ కల్యాణ్ తియ్యటి అబద్ధాలు చెప్పారు: పేర్ని నాని

    అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. "మచిలీపట్నం సభలో తియ్యటి అబద్ధాలు చెప్పారు పవన్. ఆయన అభిమానులకి రుచించని మాటలకు పంచదారపూతపూసి చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరి ద్వేషం కోసం పార్టీ పొట్టారో చెప్పాలి. బీజేపీతో కటీఫ్ అని చెప్పారు. తెలివితేటలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. యథావిధిగా చంద్రబాబుతో వెళ్తున్నానని చెబుతున్నారు. కులం లేదని చెబుతూ కాపు కులస్థుల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు" అని పేర్ని నాని అన్నారు.  ఎన్నికల్లో విడివడిగా కాదని, అందరూ కలిసే రండి చూసుకుందామని పేర్ని నాని అన్నారు. 2024‌ ఎన్నికల్లో చితక్కొట్టి ఇంటికి పంపిస్తామని చెప్పారు.

    Perni Nani slams Pawan

  • 15 Mar 2023 11:31 AM (IST)

    శాసనమండలి రేపటికి వాయిదా

    ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. శాసన సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.

  • 15 Mar 2023 10:39 AM (IST)

    చంద్రబాబు హయాంలో 5 వేల స్కూళ్లను మూసేశారు: బొత్స

    చంద్రబాబు నాయుడి హయాంలో 5 వేల స్కూళ్లను మూసివేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ సర్కారు హయాంలో ఒక్క బడి కూడా మూసేయలేదని చెప్పారు. సర్కారు బడులకు సీఎం జగన్ ప్రాణం పోశారని వ్యాఖ్యానించారు. విద్యాశాఖపై సీఎం జగన్ ప్రతి నెల రెండు సార్లు సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు.

  • 15 Mar 2023 10:05 AM (IST)

    వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదు: మంత్రి బుగ్గన

    నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రులు, వైసీపీ సభ్యులు మండిపడుతున్నారు. వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత మంత్రులు, అధికారులకు వినతి పత్రం ఇస్తే పరిష్కారరని చెప్పారు. రైతుల కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు.

  • 15 Mar 2023 09:26 AM (IST)

    కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి అంబటి ఆగ్రహం

    ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తుండడంతో ఆయనపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సభను అడ్డుకునేందుకే ఆయన వచ్చారని, ఆయనపై టీడీపీ ఉన్నట్టుండి ప్రేమ కురిపిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నమ్మకద్రోహని అన్నారు.

  • 15 Mar 2023 09:20 AM (IST)

    ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ నిరసన

    నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కంటోన్న సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేస్తానని చెబుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. సమస్యలపై పలు సార్లు సీఎం జగన్, మంత్రులతో చర్చించినప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పారు. అసెంబ్లీలో ప్లకార్డు ప్రదర్శిస్తూనే ఉంటానని అన్నారు.

  • 15 Mar 2023 09:17 AM (IST)

    టీడీపీ వాయిదా తీర్మానం!

    సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వాన్ని ఆయా అంశాలపై నిలదీయాలని టీడీపీ నిర్ణయించింది.

  • 15 Mar 2023 09:12 AM (IST)

    రైతులకు అండగా ప్రభుత్వం: కాకాణి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.

  • 15 Mar 2023 09:05 AM (IST)

    గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నిన్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి, దానిపై చర్చించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు