Violence in Ramireddy Palli
AP Assembly Election 2024 : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నివురుగప్పిన నిప్పులా గ్రామంలో పరిస్థితి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. నిన్న పోలింగ్ ముగిసే సమయంలో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య వివాదం మొదలైంది. పోలింగ్ కేంద్రంలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకొని రామిరెడ్డిపల్లికి చంద్రగిరి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేరుకున్నారు. గ్రామంలోకి వచ్చిన మోహిత్ ను అడ్డుకొని, కారు ధ్వంసం చేశారు. మోహిత్ రెడ్డికి చెందిన మరో వాహనానికి గ్రామస్తులు నిప్పు పెట్టారు.
Also Read : హైదరాబాద్‌కు తిరుగుపయనమైన ఓటర్లు.. విజయవాడ హైవేపై వాహనాల రద్దీ
ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పలువురు గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తనయుడు వినీల్ గ్రామానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అయితే, వైసీపీ నేత, చంద్రగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లును ధ్వంసం చేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీస్ అదనపు బలగాలు గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టాయి. అర్ధరాత్రి దాటిన తరువాత వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి తలెత్తిన ఘర్షణ వాతావరణంతో మంగళవారంసైతం గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.