రెండు దిక్కులను కిషన్ రెడ్డి కలపగలరా?

  • Publish Date - August 7, 2020 / 07:32 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. ఒక పార్టీ నేతలపై మరొక పార్టీ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే బీజేపీలో మాత్రం సొంత పార్టీ నేతలకు కౌంటర్లు ఇచ్చుకునే పరిస్థితులున్నాయి. రాష్ట్ర బీజేపీ ఒక స్టాండ్ పైన ఉంటుంది. పార్టీలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లైన్ ఒక విధంగా ఉంటుంది.

రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వైఖరి మరోలా ఉంటుంది. రాజధాని వికేంద్రీకరణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దతు తెలుపుతుండగా రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మాత్రం తప్పుబడుతున్నారు. గతంలో ఇదే అంశంలో పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. అందుకే ఆయనను అధ్యక్ష బాధ్యతల తప్పించారంటూ ప్రచారం జరుగుతోది.



సుజనా చౌదరి మాట్లాడిన మాటలకు జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు ఇస్తున్నట్టుగా ఉందని పార్టీ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా చర్చ సాగుతోంది. దీంతో పరిస్థితులను చక్కబెట్టేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చిందంటున్నారు కమలనాథులు. ఇక్కడే మరో సమస్య వచ్చింది. సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగిండం సుజనాకు ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే సుజనా చౌదరి ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపించడం, నేతలు ఎవరికి వారుగా రాజధాని అంశంపై మాట్లాడుతుండడంతో సమస్యను చక్కబెట్టేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంటికి స్వయంగా వెళ్లారు. వీరిద్దరి కలయికను మర్యాద పూర్వకమేనని బయటికి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగి ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.



పార్టీ నేతలు ఏ అంశంపై మాట్లాడినా ఒకేలా ఉండాలని కిషన్ రెడ్డి సూచించినట్లు కమలనాథులు చెబుతున్నారు. బీజేపీ నేతలు తలో మాట మాట్లాడడంతో ఎవరి మాటల్లో నిజమెంతో తెలియక కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు తికమక పడుతున్నారు. బయట ఏం చెప్పాలో తెలియడం లేదంటున్నారు. దీంతో పార్టీ నేతల మధ్య చిచ్చు మొదలయ్యేలా ఉందని గుసగుసలాడుకుంటున్నారు.