Ap Cabinet
AP Cabinet: ఏపీలో చాలా కాలంగా నలుగుతూ వస్తున్న అస్సైన్డ్ భూముల క్రయవిక్రయాల చట్టానికి ఎట్టకేలకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడింది. 1977నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం.. చట్టసవరణకు కేబినెట్ ఆమోదం లభించింది. శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఈ మేరకు ఈ చట్టాన్ని ఆమోదించింది. దీంతో చాలా కాలంగా అస్సైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు అడ్డంకి తొలగిపోనుంది.
దీంతో క్యాబినెట్ పలు కీలక అంశాలకు, అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణ, అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపిన క్యాబినెట్.. పోలవరం నిర్వాసితులకు అదనంగా మరో పదిలక్షలు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. మచిలీపట్నం, భావనపాడు సవరించిన డీపీఆర్‌లకు ఆమోదముద్ర వేసింది.
ఇక, నాడు-నేడు కింద పాఠశాలల్లో దశల వారీగా అభివృద్ధి పనులకు.. 21 వేల కోట్లు ఖర్చు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఆగస్టు 10న మూడో విడత నేతన్న నేస్తం అమలు చేయాలని నిర్ణయించింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్లు కలిగిన అగ్రిగోల్డ్ బాధితులకు.. రూ.500కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
వీటితో పాటు మూడు రాజధానుల అంశంలో కట్టుబడి ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా ఏపీలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ కార్యాలయాలు, హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలు తరలించాలని, రాష్ట్ర మానవహక్కుల సంఘం కార్యాలయాన్నీ కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.