ఏపీ మంత్రుల్లో కలవరం మొదలైంది. రెండేళ్లు మనకు డోకా లేదని అనుకున్న మంత్రులు లోలోన తెగ మదన పడుతున్నారు. కొత్తగా మంత్రులు వస్తే తమ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని భావించి టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ప్రమోషన్ వస్తుందో, ఎవరికి డిమోషన్ వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
కొత్త మంత్రులు వీరే:
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలతో ఏపీ కేబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. వీరి స్థానంలో తీసుకోబోయే ఇద్దరి పేర్లు కూడా ఇప్పటికే ఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ కృష్ణకు కేబినెట్ లో బెర్తులు కన్ ఫమ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ బుధవారం(జూలై 22,2020) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారట.
మంత్రుల శాఖల్లో మార్పులు ఖాయం:
కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత మంత్రుల శాఖల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎవరి శాఖల్లో మార్పులు జరుగుతాయో అనే కలవరం మంత్రుల్లో మొదలైంది. కొత్తగా వచ్చే ఇద్దరు మంత్రులు మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో వారికి ప్రాధాన్యత కలిగిన శాఖలను అప్పగించకపోవచ్చు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ చూసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖలు.. మోపిదేవి వెంకటరమణ చూసిన పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖలను కొత్తగా వచ్చే మంత్రులకు ఇవ్వకపోవచ్చు. వీటిని సీనియర్ మంత్రులకు అప్పగించే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే మంత్రులకు ఇతర శాఖలు కట్టబెట్టే అవకాశం ఉంది. దీంతో మంత్రుల శాఖల్లో మార్పులు అన్నది తప్పనిసరి.
మళ్లీ కొత్త శాఖలపై పట్టు పెంచుకోవాలని ఆందోళన:
ఎవరికి ఏ శాఖ అప్పగిస్తారోనని మంత్రులు లోలోపల మదనపడుతున్నారు. ఏడాదిగా తమకు కేటాయించిన శాఖలపై పట్టు పెంచుకున్నా, మళ్లీ శాఖల మార్పు అంటే కొత్త శాఖలపై పట్టు తెచ్చుకోవాలన్నది వారి ఆందోళనగా తెలుస్తోంది. అంతేకాదు శాఖల మార్పుల్లో ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో అని సన్నిహితుల దగ్గర కొందరు మంత్రులు ఆవేదన వెళ్లబోసుకుంటున్నట్టు సమాచారం.
ధర్మానకు డిప్యూటీ సీఎం పదవి, రెవెన్యూ శాఖ:
కొత్త మంత్రులతో పాటు ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్టుని కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఖాళీ అయిన స్థానం బీసీ సామాజికవర్గానిది కనుక బీసీల్లో ఒకరికి డిప్యూటీ సీఎం చాన్స్ వస్తుంది. దీంతో డిప్యూటీ సీఎంగా ధర్మాన క్రిష్ణదాస్ కు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధర్మాన క్రిష్ణదాస్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా జగన్ ఆయనకే అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డికి కీలక శాఖ అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి శాఖల్లో మార్పులు జరిగితే ఎలాంటి మార్పులు ఉంటాయనే ఆందోళనలో పలువురు మంత్రులు ఉన్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఎవరెవరికి ఏయే శాఖలు ఉంటాయో, పోతాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.