Nethanna Bharosa Scheme: ఏపీలో నేతన్నకు భరోసా రూ.25000.. డేట్ ఫిక్స్.. డబ్బులు పడేది ఆ రోజే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో సాగిన మంత్రివర్గ సమావేశం సంక్షేమ పథకాల(Nethanna Bharosa Scheme) విస్తరణ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై లోతుగా చర్చించింది.
- V Santhosh Kumar
- Published on- July 23, 2026 / 02:58 PM IST
Ap Cabinet green signal to provide 25,000 to weavers under Nethanna Bharosa scheme
- నేతన్నలకు ఆగస్ట్ 7న లబ్ధి
- నిజమైన అర్హులకే భరోసా సాయం
- ప్రతిపక్షాల కుట్రలపై సీఎం ఫైర్
Nethanna Bharosa Scheme: అమరావతిలోని రాష్ట్ర సచివాలయం కీలక నిర్ణయాలకు వేదికైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో సాగిన మంత్రివర్గ సమావేశం సంక్షేమ పథకాల విస్తరణ, పరిపాలనా సమర్థత, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై లోతుగా చర్చించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలను, కుట్రలను తిప్పికొట్టేలా ప్రభుత్వాన్ని మరింత వేగవంతం చేయాలని సీఎం అమాత్యులకు స్పష్టమైన సూచనలు చేశారు.
నిజమైన చేనేతలకు ‘నేతన్న భరోసా’:
చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ‘నేతన్న భరోసా(Nethanna Bharosa Scheme)’ పథకంపై కేబినెట్‌లో ప్రాధాన్య చర్చ జరిగింది. గత పాలనలో అనర్హులకు లబ్ధి చేకూరిందన్న అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి, నిజమైన అర్హులకు మాత్రమే న్యాయం జరగాలని స్పష్టం చేశారు. పారదర్శకమైన రీతిలో అర్హులను ఎంపిక చేసి, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నట్లు ప్రకటించారు.
మెగా డీఎస్సీ వివాదాలు, వైకాపా కుట్రలపై సీఎం సీరియస్:
మరోవైపు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన ‘మెగా డీఎస్సీ’ అంశాన్ని ఢిల్లీ ఆందోళనలతో జోడించి వివాదాస్పదం చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు, నిరాధారమైన వివాదాలు సృష్టించడం వైకాపాకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి మంత్రులంతా ప్రో-యాక్టివ్‌గా వ్యవహరించాలని, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు.
