Ap Cabinet: ఏపీ కేబినెట్.. 25 కీలక అంశాలపై చర్చ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Ap Cabinet) కొనసాగుతోంది.
AP CM Chandrababu Cabinet discusses 25 key issues, govt jobs and nethanna bharosa scheme
- కేబినెట్లో కీలక నిర్ణయాలు
- భారీగా ఉద్యోగాల భర్తీ
- చేనేతలకు ఆర్థిక సాయం
Ap Cabinet: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Ap Cabinet) కొనసాగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజారోగ్యం, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 25కు పైగా విభిన్నమైన అంశాలపై ఈ భేటీలో అమాత్యులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పలు కీలక పథకాల అమలు, పరిపాలనాపరమైన అనుమతులపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ సిద్ధమైంది.
నిరుద్యోగులకు ఊరట.. చేనేతలకు చేయూత:
ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఉద్యోగాల భర్తీ. రెండో విడత కింద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,168 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. దీనితో పాటు చేనేత కార్మికుల ఆర్థిక పురోగతి కోసం ‘నేతన్న భరోసా’ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రత్యేక విద్యావసరాలు, ఇతర ప్రాజెక్టులపై దృష్టి:
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థలం లీజును పొడిగించడం, 15వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించి అగ్నిమాపక శాఖకు సరికొత్త వాహనాలు, ఆధునిక పరికరాలు సమకూర్చే అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
