ఏపి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం యథావిధిగా 2020, జనవరి 20వ తేదీ సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని మార్పుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాజధాని మార్పు అంశంపై హై పవర్ కమిటీ తన నివేదికను కేబినెట్‌కు సమర్పంచనుంది. ఈ నివేదికపై మంత్రిమండలి కూలంకశంగా చర్చించి ఆమోదించనుంది. రాజధాని మార్పుతో ఏర్పడే సమస్యలపై కూడా చర్చించనుంది. ఉద్యోగుల సమస్యలపై కూడా మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ చర్చించనున్నారు.
సాయం రెట్టింపు
ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూముల పై చర్చించనున్నారు. ఈ విషయంపై హడావుడిగా నిర్ణయం తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తోంది. కొంత సమయం తీసుకొని రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం జగన్ భావిస్తున్నారు. రైతులతో పాటు 29 గ్రామాల్లో ఉన్న రైతు కూలీల సంక్షేమం పట్ల కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. రైతులకు, రైతు కూలీలకు గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన సాయం కంటే రెట్టింపు చేయాలన్న భావనలో జగన్ ఉన్నారు. రైతులకు ఇచ్చే కౌలు, రైతు కూలీలకు ఇచ్చే పింఛను పెంచే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చ జరగనుంది. అసైండ్ భూముల రైతులకు కూడా సమన్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకోనుంది.
ఉద్యోగుల సమస్యలు, CRDA చట్టం
ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై నిర్ణయం తీసుకోకపోయినా కొంత చర్చ జరిగే అవకాశముంది. సెక్రెటరియేట్ ఉద్యోగుల సంఘం తమ సమస్యలపై చర్చించమని హై పవర్ కమిటీని ఇదివరకే కోరింది. సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో సిఆర్డిఏ చట్టంపై కీలక చర్చ జరగనుంది. చట్టపరమైన సమస్యలు రాకుండా ఈ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు కొన్ని నిర్ణయాలను కేబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారు. ఈనెల 20వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నందున రాజధాని మార్పు, హైపవర్ కమిటీ నివేదికలపై ప్రతిపక్షం చేసే దాడిని ఎదుర్కోవడంపై చర్చించనున్నారు.
టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు
ఈ విషయంపై కొందరు మంత్రులకు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేసే ఆరోపణలు, దాడిని ఎదుర్కొని రాష్ట్ర ప్రజల మెప్పు పొందే విధంగా చర్చ జరపాలని జగన్ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయా సబ్జక్ట్ లకు సబంధించిన అంశాలపై అధికారులతో స్టడీ చేయాలని మంత్రులకు సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు రాజధాని మార్పును వ్యతిరేకిస్తుండటం… అమరావతి ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రజల దృష్టి యావత్తూ కేబినెట్ సమావేశంపైనే ఉంది. అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసే అవకాశమున్నందున కేబినెట్‌లో కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు.