Ap Cabinet Meeting : ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు సహా సీఆర్డీయే పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీపై ప్రధానంగా చర్చించనుంది.
ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా వరద పరిస్థితులు, వరద బాధితులకు సాయం, వరదల వల్ల కలిగిన నష్టంపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక భవిష్యత్తులో వరదలు వచ్చినా బుడమేరు కారణంగా ఎలాంటి ప్రమాదం, నష్టం జరక్కుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, బుడమేరును ఏ విధంగా పటిష్టం చేయాలి అన్న అంశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎప్పుడు వరదలు వచ్చినా విజయవాడకు ఎలాంటి నష్టం జరగకుండా, పంట నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా డిస్కస్ చేయనున్నారు. అలాగే వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అన్నదానిపై కేబినెట్ లో చర్చించే ఛాన్స్ ఉంది.
Also Read : బాలినేని నిజంగానే వైసీపీతో కటీఫ్‌కి సిద్ధమయ్యారా? అసలేం జరిగింది..
రైతాంగానికి జరిగిన నష్టం, వారికి అందించాల్సిన సాయం తదితర అంశాలపైన మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశాలన్నింటిపై కేబినెట్ లో సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వరద సాయం విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలి అన్నదానిపై కేబినెట్ లో చర్చించనున్నారు. సీఆర్డీఏయే పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ అంశాలపైనా ఏపీ కేబినెట్ లో డిస్కస్ చేయనున్నారు.