బాలినేని నిజంగానే వైసీపీతో కటీఫ్‌కి సిద్ధమయ్యారా? అసలేం జరిగింది..

కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా జిల్లాలో అన్నీతానై చక్రం తిప్పిన బాలినేని.. వైసీపీ అధికారంలో ఉండగా అదే విధంగా హవా నడపాలని చూశారని అంటున్నారు.

బాలినేని నిజంగానే వైసీపీతో కటీఫ్‌కి సిద్ధమయ్యారా? అసలేం జరిగింది..

Gossip Garage : వైసీపీ నేత బాలినేని మళ్లీ అలకపాన్పు ఎక్కారట. ఎప్పటికప్పుడు పార్టీకి రాజీనామా అంటూ బెదిరించే బాలినేని ఈసారి కచ్చితంగా బైబై చెప్పేస్తానని తన అనుచరులతో చెబుతున్నారట.. పార్టీ మారడం ఖాయమే కానీ, కచ్చితమైన డేట్‌ మాత్రం ఇప్పుడే చెప్పనని మడతేస్తుండటమే తాజా ట్విస్టు.. బాలినేని షరా మామూలుగానే ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారా? లేక నిజంగానే వైసీపీతో కటీఫ్‌కి సిద్ధమయ్యారా? అసలు వైసీపీ వీడతారని ప్రచారమెందుకు? సొంత కుటుంబాన్ని కాదని… వేరు కుంపటి పెట్టే సాహసం ఎందుకు చేయబోతున్నారు? బాలినేని కటీఫ్‌ కథలో నిజానిజాలేంటి?

జగన్‌తో ఉన్న బంధుత్వం కారణంగా కొన్నాళ్లు వేచి చూశారు..
వైసీపీలో సీనియర్‌ నేత.. మాజీ మంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు సమీప బంధువు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న బాలినేని… ఎన్నికల ముందే వైసీపీని వీడతారని ప్రచారం జరిగింది. కానీ, మాజీ సీఎం జగన్‌తో ఉన్న బంధుత్వం కారణంగా కొన్నాళ్లు వేచి చూడాలని అప్పట్లో నిర్ణయించుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీతోపాటు బాలినేని కూడా ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీతో తెగతెంపులు చేసుకోవడమే మేలని తాజాగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తన మనసులో మాటను చెప్పేందుకు పార్టీ అధ్యక్షుడిని కలిసినా, ఆయన ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఇక తన దారి తాను చూసుకోవాలని బాలినేని డిసైడ్‌ అయినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

బాలినేని, వైవీ మధ్య తీవ్రమైన విభేదాలు..
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గానికి చెందిన బాలినేని వైసీపీలో సీనియర్‌ నేత. తొలుత కాంగ్రెస్‌లో పనిచేసిన బాలినేని… వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ వెంటే నడిచారు. జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని బావా బామ్మర్దులు. ఐతే రాజకీయంగా బాలినేని, వైవీ మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని చెబుతుంటారు. రాజకీయంగా ఇద్దరూ ఒకే జిల్లాలో ఆధిపత్యం కోరుకోవడం వల్ల ఇద్దరి మధ్య గ్యాప్‌ బాగా పెరిగిపోయింది. పార్టీ అధినేత జగన్‌ కూడా తన బాబాయ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల బాలినేని ఎప్పటికప్పుడు మనస్థాపానికి గురయ్యే వారు. కొన్నిసార్లు బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కేవారు బాలినేని. కానీ, ఆయన అసంతృప్తి, ఆవేదన షరా మామూలే అన్నట్లు వైసీపీ లైట్‌గా తీసుకునేది చెబుతున్నారు. దీంతో పార్టీ అధిష్టానంపై రగిలిపోయిన బాలినేని చాలా కాలంగా వైసీపీకి బై బై చెప్పేయాలని ఆలోచనతోనే ఉన్నారు. ఐతే ఏ పార్టీలో చేరాలనే విషయమై కొంత తర్జనభర్జన కొనసాగడంతో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైందని అంటున్నారు.

బాలినేని హవాకు బ్రేకులు వేసిన వైవీ సుబ్బారెడ్డి..
1999లో తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన బాలినేని ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004లో వైఎస్‌ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేట్టారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా జిల్లాలో అన్నీతానై చక్రం తిప్పిన బాలినేని.. వైసీపీ అధికారంలో ఉండగా అదే విధంగా హవా నడపాలని చూశారని అంటున్నారు. ఐతే ఆయన ఆధిపత్యానికి గండి కొట్టే విధంగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పావులు కదపడంతో బాలినేని హవాకు బ్రేకులు పడ్డాయి. ఇదే సమయంలో తన జిల్లాలో వేరొకరి ఆధిపత్యాన్ని ఓర్వలేకపోయిన బాలినేనిలో వ్యతరేకత పెరుగుతూ వచ్చింది. వైసీపీ అధికారంలో ఉండగా చాలాసార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన బాలినేని.. అధిష్టానం బుజ్జగింపులతో వెంటనే మెత్తపడే వారు.

త్వరలో వైసీపీకి గుడ్ బై..!
ఇదే సమయంలో 2019లో బాలినేనికి మంత్రి పదవి ఇచ్చిన జగన్‌… రెండున్నరేళ్ల తర్వాత తప్పించారు. ఈ పరిణామం కూడా జీర్ణించుకోలేకపోయిన బాలినేని పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరించారు. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే వైసీపీ తరఫున పోటీ చేశారంటున్నారు. ఎన్నికల ముందు జనసేనాని పవన్‌తో ఒకటి రెండు సందర్భాల్లో చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. పవన్‌ కూడా బాలినేనిపై పాజిటివ్‌గా ఉండటంతో ఎన్నికల ముందు బాలినేని జనసేనలో చేరతారనే టాక్‌ ఎక్కువగా వినిపించింది. కానీ, ఇప్పటివరకు ఆయన వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి రావడం, దీనికి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా అంగీకరించడంతో కొద్దిరోజుల్లో రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు.

బీజేపీ లేదా జనసేనలో చేరే అవకాశాలే ఎక్కువ..!
ఇక వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న బాలినేని.. ఏ పార్టీలో చేరాలనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటున్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ లేదా జనసేనలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌తో ఉన్న సంబంధాల కారణంగా ఆయన జనసేనలో చేరడం దాదాపు ఖాయమైందని బాలినేని అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీకి రాం రాం చెప్పేయాలని బాలినేని నిర్ణయించడంతో వైసీపీలో మరో బిగ్‌ వికెట్‌ ఔట్‌ అయినట్లేనని అంటున్నారు.

Also Read : నడిపించే నాయకులు కావలెను..! వైసీపీకి ఎందుకీ దుస్థితి? జగన్ చేసిన ఆ మార్పులే ముంచాయా?