నడిపించే నాయకులు కావలెను..! వైసీపీకి ఎందుకీ దుస్థితి? జగన్ చేసిన ఆ మార్పులే ముంచాయా?

పార్టీ యంత్రాంగం ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే సమీప భవిష్యత్‌లో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ మళ్లీ కోలుకోలేని దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు.

నడిపించే నాయకులు కావలెను..! వైసీపీకి ఎందుకీ దుస్థితి? జగన్ చేసిన ఆ మార్పులే ముంచాయా?

Gossip Garage : అధికారం గల్లంతైన తర్వాత వైసీపీకి అసలు సిసలు కష్టాలు తెలుస్తున్నాయా? అధికారం ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తోందని సైడైపోతున్నారా? మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఐదేళ్లు పని చేసిన వారు ఇప్పుడు పార్టీకి ముఖం చాటేయడానికి కారణమేంటి? మళ్లీ విజయం కోసమంటూ ఎన్నికల ముందు చేపట్టిన మార్పులు ఇప్పటికీ పార్టీని కోలుకోనీయడం లేదా? వంద నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన నాయకత్వం లేదని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?

వైసీపీని నడిపించే నాయకుడే లేరని ప్రచారం..
అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు చేపట్టిన మార్పులతో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవగా, ఓటమి తర్వాత కూడా పలువురు నేతలు పార్టీని వీడేందుకు క్యూ కడుతున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉండటంతో నియోజకవర్గ స్థాయిలో వైసీపీకి నాయకత్వ సమస్య ఏర్పడుతోందంటున్నారు. ఏలూరు, పొన్నూరు, పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకుడే లేరని ప్రచారం జరుగుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వంద నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌చార్జులు సరిగా పనిచేయడం లేదని, వారి వ్యవహారం చూస్తే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు.

నియోజకవర్గాల్లో అసలు కనిపించని మాజీ ఎమ్మెల్యేలు..
2019లో 151 మంది ఎమ్మెల్యేల బలంతో గద్దెనెక్కిన వైసీపీ… 2024 ఎన్నికల్లో అంతే ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమిని ఊహించని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకోడానికి ప్రయత్నిస్తున్నారంటున్నారు. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అసలు కనిపించడం లేదంటున్నారు. కార్యకర్తలు ఎవరైనా తమ సమస్యలు చెప్పుకోడానికి వెళితే… నియోజకవర్గ ఇన్‌చార్జిని కానని.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థితో మాట్లాడాలని చెబుతూ తప్పుకుంటున్నారని అంటున్నారు. దీంతో కార్యకర్తలు కంగుతింటున్నారు.

ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేదంటూ సైడైపోతున్నారు..!
మార్పులంటూ ఎన్నికల ముందు సుమారు 100 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులను మార్చేసి వారినే పోటీకి పెట్టింది వైసీపీ. ఇలా పోటీ చేసిన వారిలో ఏ ఒక్కరూ గెలవకపోవడంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పూర్వ ఇన్‌చార్జులు ఇప్పుడు సైడైపోతున్నారని అంటున్నారు. ఇక ఎన్నికల్లో పోటీకి హుషారుగా ముందుకు వచ్చిన నేతలు సైతం… ప్రతిపక్షంలో పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగాలంటే చాలా ఖర్చవుతుందని… అంత ఆర్థిక స్థోమత తమ వద్దలేదంటూ చేతులెత్తేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గట్టి పట్టున్న నేతలను పక్కకు తప్పించి తప్పు చేశారా?
ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చితే… ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామనే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్‌… మొండిగా మార్పులు చేపట్టారు. సీనియర్లు, నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న నేతలను పక్కకు తప్పించారు. దీంతోనే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారనే విశ్లేషణలు ఉండగా, ఎన్నికల అనంతరం కూడా వారిని పట్టించుకోలేదని టాక్‌ వినిపిస్తోంది. ఈ కారణంతోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తన రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకుని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.

మాకెందుకు ఖర్చు అంటూ తప్పుకుంటున్న పాత ఇంచార్జ్ లు..
ఇలా మోపిదేవి ఒక్కరే కాకుండా మరో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు సైతం తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ప్రాధాన్యం లేదన్న కారణంతో అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఎన్నికల ముందు గొల్ల బాబూరావుకు రాజ్యసభ సభ్యుడిని చేసి ఆయన స్థానంలో విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల తర్వాత జోగులు అస్సలు కనిపించలేదని అంటున్నారు. ఇలా ఎన్నికల ముందు కొత్త నియోజకవర్గాలకు వచ్చిన ఇన్‌చార్జులు ఎవరూ ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో లేకపోవడం, పాత ఇన్‌చార్జులు తమకెందుకు ఖర్చు అంటూ తప్పుకుంటుండటంతో వైసీపీ కార్యకర్తలు బిక్కముఖం పెడుతున్నారు.

Also Read : ఆపరేషన్ కొల్లేరు..! సీఎం చంద్రబాబు అంత పెద్ద సాహసం చేయగలరా?

100కు పైగా నియోజకవర్గాల్లో నాయకత్వ సంక్షోభం..!
ప్రస్తుతం వైసీపీ అంటే అధినేత జగన్‌ ఒక్కరే అన్నట్లు ఆ వంద నియోజకవర్గాల్లో పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు. పార్టీ యంత్రాంగం ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే సమీప భవిష్యత్‌లో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ మళ్లీ కోలుకోలేని దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే వందకు పైగా నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వం లేదనే విషయమే స్పష్టమవుతోంది.