రాజధాని రగడ 26వ రోజు : అమరావతే ముద్దు..మూడు రాజధానులు వద్దు

  • Publish Date - January 12, 2020 / 08:51 AM IST

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 29గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ బలగాలతో పికెటింగ్ చేస్తున్నారు. అటు 26వ రోజూ 2020, జనవరి 12వ తేదీ ఆదివారం రైతులు, ప్రజల ఆందోళనలు చేపడుతున్నారు. తుళ్లూరులో టెంట్లు వేసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. 144 సెక్షన్, 30యాక్ట్ అమల్లో ఉందన్న పోలీసులు.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాజధాని ప్రాంతవాసులు, రైతులు ఏమాత్రం తగ్గట్లేదు. ఒక్క అమరావతే ముద్దు… మూడు రాజధానులు వద్దంటూ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ… వైసీపీ ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

పెరుగుతున్న మద్దతు : – 
అమరావతి రైతులకు పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తుంది. అమరావతిలోని నిజాంపేట క్రాస్‌ రోడ్స్‌కు భారీ స్థాయిలో తరలివచ్చిన యువత…రైతులకు మద్ధతు తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ విషయం తెలుసుకున్న మీడియా, తెలుగుదేశం పార్టీ అభిమానులు హుటాహుటిన స్టేషన్‌కు తరలివెళ్లారు. ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా అమరావతి రైతులకు పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. 
 

ప్రవాసాంధ్రుల నుంచి మద్దతు : – 
అమరావతి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని ప్రవాసాంధ్రుల నుంచి కూడా మద్ధతు లభిస్తోంది. సేవ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో అమెరికాలో ఎన్నారైలు వివిధ నగరాల్లో సమావేశాలు, నిరసనలు చేపడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి…అధికార వికేంద్రీకరణ కాదు..అంటూ ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు. కాలిఫోర్నియా, ఒమాహ, కాన్సాస్‌ సిటీ, కొలంబస్‌, డల్లాస్‌తో పాటు పలు నగరాల్లో నిరసనలు, సమావేశాలు చేపట్టారు. 

Read More : ద్వారంపూడి ఇంటి ముట్టడి : జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి