కేంద్రం నుంచి పిలుపొచ్చింది.. రేపు ఢిల్లీ వెళ్తున్నా : పవన్

  • Publish Date - January 21, 2020 / 09:49 AM IST

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రేపు బుధవారం (జనవరి 22, 2020) వెళ్లనున్నారు. కేంద్రం నుంచి తనకు పిలుపు వచ్చిందని, ఢిల్లీ వెళ్తున్నానని పవన్ తెలిపారు. వైసీపీ వినాశనానికి రాజధాని మార్పు నాంది పలికిందన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఇదే తాను కేంద్రాన్ని కోరేదని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదన్నారు. అధికారులు మదమెక్కి ఇలా పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల బాధ వింటుంటే ఆవేదన కలుగుతోందన్నారు. మహిళల కన్నీరుతో వైసీపీ వినాశనం మొదలైందన్నారు.

భవిష్యత్ లో వైసీపీ అధికారంలో ఉండకూడదని, అమరావతి నుంచి రాజధాని కదలదని పవన్ అన్నారు. అమరావతి పరిరక్షణ పోరాట సమితికి తమ మద్దతు ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితిని తెలియజేస్తానని రాజధాని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం లేకుండా చేసేందుకు ఏం చేయాలో చేస్తానన్నారు. రైతులు, మహిళల్ని ఏడిపించిన వారు సర్వనాశనమైపోతారని జనసేనాని శాపనార్థాలు పెట్టారు.

రాజధాని మార్పుపై అన్ని వివరిస్తానని చెప్పారు. ఒకటి మాటిస్తున్నా.. ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతిని శాశ్వతంగా ఉంచేలా పోరాటం చేస్తామన్నారు. అన్ని భయాలు పక్కన పెట్టాలని పవన్ చెప్పారు. తాను అవకాశవాద రాజకీయాలు చేయనని, ప్రజలకు మనశ్శాంతి కలిగించేలా రాజకీయాలు చేస్తానని పవన్ అన్నారు.