AP CID Raids : ఏపీ వ్యాప్తంగా మద్యం తయారీ కేంద్రాల్లో సీఐడీ దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడ, విశాఖ, ఒంగోలు, కర్నూలు, ఏలూరు జిల్లాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. విజయవాడ ఆటోనగర్ లని డిస్టిలరీలో సోదాలు చేపట్టారు సీఐడీ అధికారులు. కాంటినెంటల్ వైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్టిలరీలోనూ తనిఖీలు చేస్తున్నారు.
అటు అనకాపల్లి జిల్లాలోనూ తనిఖీలు చేస్తున్నారు. కసింకోట మండలం సుందరయ్య పేటలోని మద్యం తయారీ కేంద్రాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. విశాఖ డిస్టిలరీ, జేఎస్పీ డిస్టిలరీలో అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో లోనికి ఎవరినీ అనుమతించ లేదు అధికారులు. అటు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన లిక్కర్ ఫ్యాక్టరీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. 2019 నుంచి జరిగిన మద్యం అమ్మకాలు, లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తనిఖీలు.. ఇంకా కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు దిగారు సీఐడీ అధికారులు. మద్యం ఫ్యాక్టరీలలో సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో అవకతవకలపై ఆరా తీస్తున్నారు. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ లో తనిఖీలు జరిపిన అధికారులు.. పలు రికార్డులను పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో టీమ్ లో 10 మంది చొప్పున అధికారులు ఉన్నారు. గత ప్రభుత్వంలో (2019-2024) మద్యం తయారీ కంపెనీల్లో అవకతవకలు జరిగాయని సీఐడీ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీని ఆధారంగా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రైడ్స్ కు దిగారు. ఈ సోదాల్లో కొన్ని కీలక రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్ లను కూడా సీజ్ చేశారు.
విజయవాడలోని ఆటోనగర్ లోని కాంటినెంటల్ వైన్స్ ఫ్యాక్టరీ నుంచి ప్రతిరోజూ 15 నుంచి 20 లారీల మద్యం బయటకు వెళ్తుందని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో.. మద్యం తయారీ కంపెనీలలో రోజుకు ఎంత మద్యం తయారు చేశారు? లెక్కల్లో ఎంత చూపారు? లెక్కల్లో లేకుండా ఎంత మేరకు లిక్కర్ విక్రయాలు జరిపారు? ఇలాంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆయన కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. దాని ఆధారంగానే ఇప్పుడు సీఐడీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం తయారీ కంపెనీలలో సోదాలు జరుపుతున్నారు.
Also Read : అన్‌స్టాపబుల్‌లో జైలు జీవితం గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఏడ్చేసిన ఆడియన్స్.. ప్రోమో వైరల్..